
ఉద్యోగి అంటే ఒక సంస్థలో గంటలకొద్దీ పని చేసే రోబో కాదు. మనస్ఫూర్తిగా తన బుర్రకు పని చెప్పి ఆ సంస్థకు తన సేవలు అందించడం. అందుకే కంపెనీల్లో చాలావరకు జీతం ఇచ్చి చేతులు దులుపుకోవడం లేదు. ఉద్యోగిని సంతృప్తి పరిచేందుకు కూపన్లని, బోనస్‌లని, అలవెన్సులని ఎక్సెట్రా.. ఎక్సెట్రా అందిస్తుంటాయి.
సాధారణంగా ఇంటర్వ్యూలలో జీతం ఎక్కువ ఇవ్వమనో లేకుంటే వాళ్ల వాళ్ల అవసరాలను హెచ్‌ఆర్‌లకు తెలియజేస్తుంటారు. అయితే.. ఓ ఉద్యోగాభ్యర్థి ‘లెక్క’ మాత్రం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. కంపెనీలు కొత్త పాలసీ తీసుకురావాలన్న చర్చ డిమాండ్‌కు దారి తీసింది.
ఢిల్లీ కంపెనీ హెచ్‌ఆర్ ఒకరు.. తాజాగా ఓ వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు. అయితే తనకు ఇవ్వబోయే ప్యాకేజీకి వానకాలంలో కాస్త అదనంగా జీతం చేర్చాలని ఆ హెచ్‌ఆర్‌ను కోరాడతను. అందుకు కారణం ఏంటి? అని హెచ్‌ఆర్ అడగ్గా.. వానాకాలంలో తన ఆఫీస్ ప్రయాణాలకు అయ్యే ఖర్చును కంపెనీనే భరించాలన్నాడు. ‘‘సాధారణ రోజుల్లో నాకు అయ్యే ఖర్చు కంటే వానాకాలంలో కాస్త ఎక్కువే. కాబట్టి కంపెనీ రెయిన్ అలవెన్స్ చెల్లించాలి’’ అని కోరాడతను. అయితే మునుపెన్నడూ వినని ఆ ప్రస్తావనతో హెచ్‌ఆర్ కాస్త అయోమయానికి గురైనా వెంటనే తేరుకుని.. అలాంటి పాలసీ తమ కంపెనీలో లేదని బదులిచ్చారు.
.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరులాంటి మహానగరాల్లో వర్షాలు పడేటప్పుడు ట్రాఫిక్ చిక్కులు షరామామూలేనని, అలాంటి సమయంలో క్యాబ్ తరహా సేవల ఖర్చు తడిసి మోపెడు అవుతుందని.. అలాంటప్పుడు రెయిన్ అలవెన్స్ కోరడం ఎంతవరకు సబబని ఆ హెచ్‌ఆర్ ఆ ఉద్యోగ అభ్యర్థిని ప్రశ్నించారు. దీంతో ఆ వ్యక్తి సాధారణ రోజుల్లో తనకు అయ్యే ఖర్చును.. వానాకాలంలో ఆఫీస్ ప్రయాణాలకు అయ్యే ఖర్చను లెక్కేసి మరీ హెచ్‌ఆర్‌కు వివరించారు. అదే సమయంలో.. అలాంటి చెల్లింపులు(రెయిన్ అలవెన్స్) వీలులేని పక్షంలో వర్క్‌ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించాలని, అదీ కుదరకుంటే ఆలస్యంగా వచ్చేందుకైనా అనుమతించాలని కోరాడతను.
ఆ వ్యక్తి సెలక్ట్ అయ్యాడో లేదో తెలియదుగానీ.. ఈ ఇంటర్వ్యూ వివరాలను ఆ హెచ్‌ఆర్ రెడ్డిట్‌లో పంచుకున్నారు. దీంతో ఆ ఉద్యోగ అభ్యర్థికి మద్దతుగా చాలామంది పోస్టులు పెడుతున్నారు. అంతెందుకు ఆ హెచ్‌ఆర్ కూడా ఆ వ్యక్తి కోరింది సబబుగానే ఉందంటే ఆ పోస్టులో ప్రస్తావించడం గమనార్హం.
‘‘ఇంటర్వ్యూలో విచిత్రంగా అనిపించిన అతని కోరిక.. ఇప్పుడు సబబుగానే అనిపిస్తోంది’’ అంటూ పోస్ట్ చేశారా హెచ్‌ఆర్. అంతేకాదు.. తాను కూడా ఆఫీస్‌కు క్యాబ్‌లలోనే వెళ్తానని, వానకాలంలో అతను చెప్పినట్లు పోల్చుకుంటే అధిక ఖర్చులే ఉంటున్నాయని.. అతను కోరింది విచిత్రమైనదేం కాదని ఆ పోస్టులో ఆ హెచ్‌ఆర్ పేర్కొన్నారు. వానాకాలం కావడం, ప్రయాణాల్లో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
