సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల అధ్యాయం తుది దశకు చేరుకుంది. రెండో దశలో ఈ నెల 11వ తేదీన 122 అసెంబ్లీ స్థానాలకు తుదిదశ పోలింగ్ జరగనుంది. ఇది సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి, తేజస్వీ యాదవ్ సారథ్యంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి రాజకీయ ఎత్తుగడలకు అసలు సిసలు పరీక్షగా మారింది. చంపారన్ కంచుకోటల నుంచి సీమాంచల్ సంక్లిష్ట సమీకరణాల వరకు అరడజనుకు పైగా మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతల తలరాతలు ఈవీఎంలలో నిక్షిప్తం కానున్నాయి. తొలి దశ హోరాహోరీగా ముగియగా, ఈ ఫైనల్ రౌండ్‌లో గెలిచి గద్దెనెక్కేదెవరన్న దానిపై నరాలు తెగే ఉత్కంఠ నడుస్తోంది.
అందరి దృష్టి వీరిపైనే...
రెండో దశ పోలింగ్ నితీశ్ కుమార్ కేబినెట్ సహచరులకు, మహాగఠ్‌బంధన్ ప్రభుత్వంలోని మాజీ మంత్రులకు చావోరేవోగా మారింది.
వీరి గెలుపోటములు కూటముల భవిష్యత్తును శాసించనున్నాయి. అందరి దృష్టీ వీఐపీలపైనే ఉంది. వారెవరంటే..
⇒ రేణు దేవి (బీజేపీ, బెట్టియా): రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె పశ్చిమ చంపారన్‌లో బీజేపీకి అత్యంత కీలకమైన, బలమైన నాయకురాలు. ఈమె గెలుపు కూటమికి అత్యంత ప్రతిష్టాత్మకం.
⇒ లేషి సింగ్ (జేడీయూ, ధమ్‌దాహా): నితీశ్ కేబినెట్‌లో ప్రస్తుత ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి. సీమాంచల్ ప్రాంతంలో జేడీయూకి బలమైన మహిళా నాయకురాలు. 2020లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన ఈమె, ఈసారి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.
⇒ లలిత్ కుమార్ యాదవ్ (ఆర్జేడీ, దర్భంగా గ్రామీణ): గత మహాగఠ్‌బంధన్ ప్రభుత్వంలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ మంత్రి. దర్భంగా ప్రాంతంలో ఆర్జేడీకి బలమైన యాదవ నేతగా ఈమెను భావిస్తున్నారు.
⇒ మదన్ సహాని (జేడీయూ, బహదూర్‌పూర్): సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. అత్యంత వెనుకబడిన వర్గాల (ఈబీసీ) నుంచి వచ్చిన బలమైన నాయకుడు. ఈయన గెలుపు ఎన్డీయేకు ముఖ్యం.
⇒ సమీర్ కుమార్ మహాసేఠ్ (ఆర్జేడీ, మధుబని): గత మహాగఠ్‌బంధన్ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి. మిథిలాంచల్ ప్రాంతంలో, ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో మంచి
పట్టున్న నేత.
⇒ ప్రమోద్ కుమార్ (బీజేపీ, మోతిహరి): మోతిహరి నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి. ఈయన గెలుపు బీజేపీకి నల్లేరుపై నడకేనని భావిస్తున్నా, ఆర్జేడీ మాత్రం గట్టి పోటీ ఇస్తోంది.
⇒ అక్తరుల్ ఇమాన్ (ఎంఐఎం, అమౌర్): ఈయన అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు. సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా ఈయన మహాగఠ్‌బంధన్ అభ్యర్థుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
చంపారన్ కోటలో హోరాహోరీ..
ఈ నాలుగింటిపైనే ఫోకస్!
2020 ఎన్నికల్లో చంపారన్ ప్రాంతం (తూర్పు, పశ్చిమ) ఎన్డీయేకు కంచుకోటగా నిలిచింది. ఈసారి ఈ కోటను బద్దలుకొట్టాలని మహాగఠ్‌బంధన్, నిలబెట్టుకోవాలని ఎన్డీయే సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇక్కడ నాలుగు నియోజకవర్గాలు రాష్ట్రవ్యాప్త ఆసక్తిని రేపుతున్నాయి.
⇒ బెట్టియా (పశ్చిమ చంపారన్): ఇక్కడ మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవి (బీజేపీ) బరిలో ఉన్నారు. 2020లో 18 వేల మెజారిటీతో గెలిచిన ఈమెకు.. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి వాషి అహ్మద్, జన్ సురాజ్ అభ్యర్థి అనిల్ కుమార్ సింగ్‌ల నుంచి త్రిముఖ పోటీ ఎదురవుతోంది. క్షేత్రస్థాయి సమస్యలు, నిరుద్యోగం ఇక్కడ ప్రభావం చూపే అంశాలు.
⇒ మోతిహరి (తూర్పు చంపారన్): బీజేపీకి ఇది అత్యంత పటిష్టమైన కోట. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రమోద్ కుమార్ (బీజేపీ) మరోసారి ఆర్జేడీ అభ్యర్థి ఓం ప్రకాష్ చౌదరితో తలపడుతున్నారు. 70% గ్రామీణ ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ప్రమోద్ కుమార్ వ్యక్తిగత ఇమేజ్, బీజేపీ సంస్థాగత బలం ఎన్డీయేకు కొండంత అండగా నిలుస్తున్నాయి.
⇒ నర్కటియాగంజ్ (పశ్చిమ చంపారన్): ఇక్కడ మహాగఠ్‌బంధన్ వ్యూహం బెడిసికొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కూటమిలో ఏకాభిప్రాయం కుదరక, ఆర్జేడీ (దీపక్ యాదవ్), కాంగ్రెస్ (శాశ్వత్ కేదార్) ఇద్దరూ బరిలో నిలిచారు. ఇది ’ఫ్రెండ్లీ ఫైట్’అని పైకి చెబుతున్నా, మహాగఠ్‌బంధన్ ఓటు బ్యాంకు స్పష్టంగా చీలిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిణామం నేరుగా బీజేపీ (సంజయ్ పాండే) విజయానికి బాటలు వేసేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
⇒ వాల్మికి నగర్ (పశ్చిమ చంపారన్): ఇది జేడీయూకి బలమైన స్థానం. సిట్టింగ్ ఎమ్మెల్యే ధీరేంద్ర ప్రతాప్ సింగ్ (జేడీయూ)కు వ్యక్తిగతంగా మంచి పట్టు ఉంది. 2015లో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఈయనే, 2020లో జేడీయూ తరపున గెలిచారు. ఈసారి కాంగ్రెస్ తరపున ప్రియాంకా గాంధీ స్వయంగా ప్రచారం చేసినా, ఇక్కడ జేడీయూ అభ్యరి్థదే పైచేయిగా కనిపిస్తోంది.


