
ఆసియాకప్-2025కు ముందు టీమిండియాకు ఓ అదరిపోయే వార్త అందింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియాకప్‌లో ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే బుమ్రా తన నిర్ణయాన్ని సెలక్టర్లు తెలియజేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లిన బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌ల మాత్రమే ఆడాడు. ఆ తర్వాత ఆఖరి టెస్టుకు ముందు బుమ్రాను జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. మూడు మ్యాచ్‌లలో బుమ్రా తన ప్రదర్శనతో ఆకట్టకున్నప్పటికి ఫిట్‌నెస్ పరంగా మాత్రం కాస్త ఇబ్బంది పడుతూ కన్పించాడు.
దీంతో ఆక్టోబర్‌లో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఆసియాకప్‌కు ముందు దాదాపు ఏభై రోజులు విశ్రాంతి లభించడంతో బుమ్రా తిరిగి టీ20 ఫార్మాట్‌లో ఆడేందుకు సిద్దమయ్యాడు.
"ఆసియా కప్ జట్టు ఎంపికకు తాను అందుబాటులో ఉంటానని బుమ్రా బుమ్రా సెలెక్టర్లకు తెలియజేశాడు. వచ్చే వారం జరిగే సమావేశంలో సెలక్షన్ కమిటీ ఈ విషయంపై చర్చించనున్నారని" ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. బుమ్రా చివరగా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ తరపున పొట్టి క్రికెట్‌లో ఆడాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ ఏడు పరుగుల తేడాతో గెలిచింది. ఈ స్పీడ్ స్టార్ కేవలం 18 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.
ఆసియాకప్-2025కు భారత జట్టు(అంచనా)
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మ
చదవండి: ఆసియాకప్ రేసులో గిల్ కంటే అతడే ముందున్నాడు: అశ్విన్