టీమిండియాతో రెండో టెస్టులో ఓపెనర్లు సౌతాఫ్రికాకు శుభారంభం అందించారు. ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram), ర్యాన్ రికెల్టన్ కలిసి ఆచితూచి ఆడుతూ తొలి వికెట్‌కు 161 బంతుల్లో 82 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఆరంభం నుంచి వికెట్లు తీసేందుకు ఇబ్బంది పడ్డ భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah).. ఎట్టకేలకు టీ విరామ సమయానికి ముందు మార్క్రమ్‌ను పెవిలియన్‌కు పంపాడు.
ఇదే జోరులో బ్రేక్‌కు వెళ్లి వచ్చిన వెంటనే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) మ్యాజిక్ చేశాడు. ర్యాన్ రికెల్టన్‌ను అవుట్ చేసి భారత్‌కు రెండో వికెట్ అందించాడు. ఏదేమైనా ఓపెనర్లు మార్క్రమ్- రికెల్టన్ 82 పరుగుల భాగస్వామ్యం కారణంగా సౌతాఫ్రికాకు శుభారంభమే లభించిందని చెప్పవచ్చు.
స్టబ్స్, బవుమా నిలకడగా..
ఇక ఓపెనర్లు అవుటైన తర్వాత వన్‌డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ తెంబా బవుమా నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు నడిపించారు. ఫలితంగా భోజన విరామ సమయానికి (మధ్యాహ్నం 1.24 నిమిషాలు) సౌతాఫ్రికా 55 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. స్టబ్స్ 82 బంతుల్లో 32, బవుమా 86 బంతుల్లో 36 పరుగులతో క్రీజులో నిలిచారు.
భారత బౌలర్లలో పేసర్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా భారత్- సౌతాఫ్రికా మధ్య గువాహటి వేదికగా శనివారం రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియంలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిలకడగా ముందుకు సాగుతోంది.
తొలిసారి ఇలా
కాగా టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి డే మ్యాచ్‌లో ముందుగా టీ విరామం ఇచ్చి.. తర్వాత లంచ్ బ్రేక్ ఇవ్వడం ఇదే తొలిసారి. గువాహటిలో సూర్యోదయం, సూర్యస్తమయానికి అనుగుణంగా టైమింగ్స్ ఇలా సెట్ చేశారు.
టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టు తుదిజట్లు ఇవే
టీమిండియా
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.
సౌతాఫ్రికా
ఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, తెంబా బావుమా(కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెన్నె (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, సెనురాన్ ముత్తుసామి, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్.
చదవండి: ఇంకా ఏం రాస్తున్నాడు?.. వైభవ్ ఏం తప్పు చేశాడు?: కోచ్‌పై మాజీ క్రికెటర్ ఫైర్


