Asia T20 Cup: ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్తాన్‌ | Pakistan A Beat Sri Lanka A In Semis Thriller By 5 Runs In Asia Cup Rising Stars 2025 IND Vs PAK Final | Sakshi
Sakshi News home page

Asia T20 Cup: శ్రీలంకను చిత్తు చేసి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్తాన్‌

Nov 22 2025 10:08 AM | Updated on Nov 22 2025 11:24 AM

Pakistan A Beat Sri Lanka A In Semis Thriller No IND vs PAK in Final

PC: ACC

ఏసీసీ పురుషుల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టీ20-2025 టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌కు ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఆఖరి ఓవర్‌ వరకు శ్రీలంక (Pak A vs SL A)తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఐదు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. దోహా వేదికగా నవంబరు 14న మొదలైన ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీ తుది అంకానికి చేరుకుంది.

శుక్రవారం నాటి తొలి సెమీ ఫైనల్లో భారత్‌-‘ఎ’ జట్టుపై గెలిచి బంగ్లాదేశ్‌-‘ఎ’ ఫైనల్లో అడుగుపెట్టగా.. రెండో సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌- ‘ఎ’- శ్రీలంక- ‘ఎ’ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 153 పరుగుల నామమాత్రపు స్కోరు సాధించింది.

దానియాల్‌ మెరుపు ఇన్నింగ్స్‌
పాక్‌ ఓపెనర్లు మొహమ్మద్‌ నసీమ్‌ (16), మాజ్‌ సదాకత్‌ (23) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ యాసిర్‌ ఖాన్‌ (6), ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన మొహమ్మద్‌ ఫరీక్‌ (7), కెప్టెన్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌ (6) పూర్తిగా విఫలమయ్యారు. షహీద్‌ అజాజ్‌ (7) కూడా ఫెయిలయ్యాడు.

ఇలాంటి దశలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఘాజి ఘోరి (36 బంతుల్లో 39 నాటౌట్‌),  సాద్‌ మసూద్‌ (22) మెరుగ్గా రాణించగా.. అహ్మద్‌ దానియాల్‌ (8 బంతుల్లో 22) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫలితంగా పాక్‌ 153 పరుగులు స్కోరు చేయగలిగింది. లంక బౌలర్లలో ప్రమోద్‌ మధుషాన్‌ నాలుగు, త్రవీణ్‌ మాథ్యూ మూడు వికెట్లతో చెలరేగగా.. మిలాన్‌ రత్మనాయకె, కెప్టెన్‌ దునిత్‌ వెల్లలగే చెరో వికెట్‌ పడగొట్టారు.

పేకమేడలా కుప్పకూలింది
నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక శుభారంభమే అందుకుంది. ఓపెనర్లు లసిత్‌ క్రూస్‌పులె (7 బంతుల్లో 27) వేగంగా ఆడగా.. విషేన్‌ హలాంబగే (27 బంతుల్లో 29) ఫర్వాలేదనిపించాడు. అయితే, పాక్‌ బౌలర్ల ధాటికి లంక మిడిలార్డర్‌ పేకమేడలా కుప్పకూలింది. నిషాన్‌ మధుష్క (6), నువానిడు ఫెర్నాండో (5), సాహన్‌ అరాచిగే (5), కెప్టెన్‌ వెల్లలగే (2), రమేశ్‌ మెండిస్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు.

క్లిష్ట పరిస్థితుల్లో లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ మిలాన్‌ రత్ననాయకె పోరాట పటిమ కనబరిచాడు. 32 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 40 పరుగులు చేశాడు. కానీ మిగతా వారి నుంచి అతడికి సహకారం అందలేదు. ప్రమోద్‌ (7), త్రవీణ్‌ మాథ్యూ (4 నాటౌట్‌), గరుక సంకేత్‌ (1) చేతులెత్తేశారు. 

విజయానికి ఐదు పరుగుల దూరంలో
ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 148 పరుగులు చేసిన శ్రీలంక.. విజయానికి ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఫలితంగా పాక్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. బంగ్లాదేశ్‌-‘ఎ’- పాకిస్తాన్‌- ‘ఎ’ మధ్య ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

ఇదిలా ఉంటే.. శ్రీలంకతో సెమీస్‌లో బ్యాట్‌, బాల్‌తో రాణించిన సాద్‌ మసూద్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. పాక్‌ బౌలర్లలో మసూద్‌, సూఫియాన్‌ ముకీమ్‌ చెరో మూడు వికెట్లు కూల్చగా.. ఉబైద్‌ షా, షాహిద్‌ అజీజ్‌, అహ్మద్‌ దానియాల్‌ తలా ఒక వికెట్‌ తీసి.. పాక్‌ ఫైనల్‌ చేరడంలో తమ వంతు పాత్ర పోషించారు.

చదవండి: IND vs BAN అందుకే సూపర్‌ ఓవర్లో వైభవ్‌ సూర్యవంశీని పంపలేదు: జితేశ్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement