బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తమ జట్టు 2026 సీజన్‌లో స్వదేశంలో ఆడే సిరీస్‌ల వివరాలను ప్రకటించింది. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరులో భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.
షెడ్యూల్ ఇదే
సెప్టెంబరు 1, 3, 6లలో వన్డేలు... 9, 12, 13 తేదీల్లో టీ20లు నిర్వహిస్తామని బీసీబీ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఆ దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులు, భారత ప్రభుత్వంతో సంబంధాల నేపథ్యంలో ఈ పర్యటన ఎంత వరకు జరుగుతుందనేది చర్చనీయాంశం.
ఒప్పందం ప్రకారం
నిజానికి గత ఏడాది జులైలోనే భారత జట్టు బంగ్లాదేశ్ గడ్డపై ఆడాల్సి ఉంది. అయితే దీనిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిరవధికంగా వాయిదా వేసింది. ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ 2026లోగా ఈ షెడ్యూల్‌ను పూర్తి చేయాల్సి ఉంది.
ప్రస్తుతం ప్రకటించిన టూర్ వివరాలు బహుశా వాయిదా పడిన సిరీస్‌ను ఆడటం గురించే కావచ్చని సమాచారం. కాగా బంగ్లాదేశ్‌లో పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ ఈ షెడ్యూల్‌పై ఎలా స్పందిస్తుందోనన్న అంశం ఆసక్తికరంగా మారింది.
బంగ్లా ఆటగాళ్లను నిషేధించాలనే డిమాండ్లు
భారత్‌ను రెచ్చగొట్టే విధంగా బంగ్లాదేశ్‌లో కొంతమంది నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు ఇవ్వడం సహా మైనారిటీ హిందూ వర్గంపై దాడుల నేపథ్యంలో.. ఇప్పటికే ఐపీఎల్‌లో బంగ్లా ఆటగాళ్లను నిషేధించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కొనుగోలు చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషయంపై బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ.. ‘‘భారత ప్రభుత్వం నుంచి ఈ విషయంలో మాకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ఇంతకుమించి దీని గురించి మాట్లాడేందుకు ఏమీలేదు’’ అని దాటవేశాయి.
చాలా సమయం ఉంది
ఇలాంటి తరుణంలో బీసీబీ ప్రకటించిన షెడ్యూల్‌లో టీమిండియాతో మ్యాచ్‌లు ఉండటం చర్చకు దారితీసింది. సిరీస్‌లకు చాలా సమయం ఉంది కాబట్టి అప్పటి పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. బంగ్లా బోర్డు ప్రకటించిన తాజా షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆ జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా వెళ్లి వన్డే, టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది.
కాగా టీమిండియా జనవరి 11 నుంచి సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లతో బిజీ కానుంది. అనంతరం టీ20 వరల్డ్‌కప్-2026 బరిలో దిగుతుంది.


