PC: X
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా (IND vs SA 2nd Test)కు ఆరంభం నుంచే పెద్దగా కలిసి రావడం లేదు. గువాహటిలో టాస్ ఓడి తొలుత బౌలింగ్‌కు దిగిన భారత్ టీ విరామ సమయం వరకు కనీసం ఒక్క వికెట్ కూడా కూల్చలేకపోయింది. వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు ఎంతగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది.
నిలకడగా ఆడిన ఓపెనర్లు
ప్రొటిస్ ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram), ర్యాన్ రికెల్టన్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించగా.. భారత బౌలర్లు ఈ జోడీని విడదీయలేక అవస్థలు పడ్డారు. నిజానికి సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఏడో ఓవర్లోనే మార్క్రమ్‌ను వెనక్కి పంపే సువర్ణావకాశం టీమిండియాకు వచ్చింది. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఏడో ఓవర్ రెండో బంతిని గంటకు 142.5 కిలోమీటర్ల వేగంతో సంధించాడు.
క్యాచ్ జారవిడిచిన రాహుల్
ఈ గుడ్‌లెంగ్త్ డెలివరీని ఆడే క్రమంలో ముందుకు వచ్చిన మార్క్రమ్ బ్యాట్ అంచుకు తాకిన బంతి.. గాల్లోకి లేచింది. ఈ క్రమంలో సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ (KL Rahul) తన ఎడమ పక్కకు జరిగిన మరీ క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు.
కానీ ఊహించని రీతిలో రాహుల్ క్యాచ్ జారవిడిచాడు. దీంతో తీవ్ర నిరాశకు గురైన బుమ్రా.. ముఖాన్ని చేతుల్లో దాచుకుంటూ తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
KL Rahul dropped the catch of A Markram 🫣#TeamIndia #IndvSA #TestCricket pic.twitter.com/yA8MzTtkWJ
— MEHRA (@DevMehra790) November 22, 2025
తొలి వికెట్ బుమ్రాకే
ఇక నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మార్క్రమ్.. ఆ తర్వాత నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ దిశగా పయనించాడు. అయితే, 27వ ఓవర్ ఐదో బంతికి బుమ్రా అద్భుత బంతితో మార్క్రమ్‌ను బౌల్డ్ చేశాడు.
దీంతో 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్క్రమ్ నిష్క్రమించాడు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోగా.. భారత్‌కు ఎట్టకేలకు బ్రేక్ లభించింది. టీ విరామ సమయానికి సౌతాఫ్రికా 26.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. మార్క్రమ్ (38).. ర్యాన్ రికెల్టన్‌తో కలిసి తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించాడు.
కాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ముప్పై పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. గువాహటిలోని బర్సపరా వేదికగా శనివారం మొదలైన రెండో టెస్టులో గెలిస్తేనే భారత్ 1-1తో సిరీస్ సమం చేసి పరువు నిలుపుకోగలుగుతుంది.
చదవండి: అందుకే సూపర్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీని పంపలేదు: జితేశ్ శర్మ


