ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ (Aus vs Eng) మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (The Ashes 2025-26) ఆరంభం నుంచే రసవత్తరంగా సాగుతోంది. పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదలైన తొలి టెస్టు.. శనివారం నాటి రెండో రోజు ఆటలోనే తుది అంకానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌పై ఆధిక్యం సంపాదించిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటింది.
172 పరుగులకే ఆలౌట్
తద్వారా.. పేసర్లకు అనుకూలిస్తున్న పెర్త్ పిచ్‌పై ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఒక రకంగా భారీ లక్ష్యాన్నే విధించింది. కాగా పెర్త్ స్టేడియం (Perth Stadium)లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ జాక్ క్రాలీ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ బెన్ డకెట్ (21)తో పాటు.. ఓలీ పోప్ (46) రాణించగా.. హ్యారీ బ్రూక్ అర్ధ శతకం (52)తో మెరిశాడు.
మిగతావారిలో వికెట్ కీపర్ జేమీ స్మిత్ (33) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 32.5 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ కేవలం 172 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ ఏడు వికెట్లు కూల్చి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. డాగెట్ రెండు, గ్రీన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
తామేమీ తక్కువ కాదని నిరూపించిన ఇంగ్లండ్ బౌలర్లు
అనంతరం తొలి రోజే తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్‌కు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. కెప్టెన్ స్టోక్స్ ఐదు వికెట్లతో చెలరేగగా.. బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ చెరో రెండు వికెట్లు కూల్చారు. దీంతో 123 పరుగులకే ఆసీస్ ఏకంగా తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ట్రవిస్ హెడ్ (21), గ్రీన్ (24), అలెక్స్ క్యారీ (26) మాత్రం ఇరవై పరుగుల స్కోరు దాటారు.
ఈ క్రమంలో 123/9 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్.. మరో తొమ్మిది పరుగులు జతచేసి ఆలౌట్ అయింది. ఫలితంగా నలభై పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. 164 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.
ఆస్ట్రేలియాకు ‘కొండంత’ లక్ష్యం
దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆసీస్‌కు 205 పరుగుల లక్ష్యం (40+164) విధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో డకెట్ 28, పోప్ 33 పరుగులు చేయగా.. టెయిలెండర్లు గస్ అట్కిన్సన్ 37, కార్స్ 20 పరుగులతో సత్తా చాటారు. ఇక ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లతో విజృంభించగా.. డాగెట్, స్టార్క్ చెరో మూడు వికెట్లు కూల్చారు.
చదవండి: IND vs SA: ఎంత పని చేశావు రాహుల్?!.. బుమ్రా రియాక్షన్ వైరల్


