టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా.. అక్షర్‌పై వేటు.. నితీశ్‌ రెడ్డితో పాటు అతడి ఎంట్రీ | IND vs SA 2025 2nd Test: SA Won Toss Playing XIs Of Both Teams | Sakshi
Sakshi News home page

టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా.. భారత తుదిజట్టులోకి నితీశ్‌ రెడ్డితో పాటు అతడు

Nov 22 2025 8:33 AM | Updated on Nov 22 2025 9:11 AM

IND vs SA 2025 2nd Test: SA Won Toss Playing XIs Of Both Teams

టీమిండియాతో రెండో టెస్టులో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా.. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. బర్సపరా వికెట్‌ ఆరంభంలో బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనే అంచనాతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రొటిస్‌ జట్టు కెప్టెన్‌ తెంబా బవుమా తెలిపాడు. పిచ్‌పై ప్రస్తుతానికి పగుళ్లు లేవన్న బవుమా.. ఈ వికెట్‌పై భారీ స్కోరు సాధించాలనే పట్టుదలతో ఉన్నామని పేర్కొన్నాడు.

గువాహటి వేదికగా జరిగే చారిత్రాత్మక తొలి టెస్టులో తాము భాగం కావడం సంతోషంగా ఉందని బవుమా హర్షం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నామని.. సెనురాన్‌ ముత్తుస్వామి జట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు.

భారత తుదిజట్టులోకి ఆ ఇద్దరు
టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మెడ నొప్పి కారణంగా సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు దూరం కావడంతో.. అతడి స్థానంలో రిషభ్‌ పంత్‌ పగ్గాలు చేపట్టాడు. బీసీసీఐ తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసినట్లు తెలిపాడు.

గిల్‌ స్థానంలో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిని ఎంపిక చేశామన్న పంత్‌..  స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ స్థానంలో సాయి సుదర్శన్‌ను తీసుకున్నట్లు వెల్లడించాడు.  ఇక తొలిసారి భారత జట్టు టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందన్న పంత్‌.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నాడు. 

టాస్‌ ఓడటంపై స్పందిస్తూ.. బర్సపరా వికెట్‌ బ్యాటింగ్‌కు బాగుంటుందన్న పంత్‌.. బౌలింగ్‌ కూడా మరీ అంత చెత్త ఆప్షన్‌ ఏమీ కాదన్నాడు. శుబ్‌మన్‌ కోలుకుంటున్నాడని.. త్వరలోనే తిరిగి జట్టుతో చేరతాడని పంత్‌ తెలిపాడు.

టీమిండియాకు చావోరేవో
ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సీజన్‌లో భాగంగా టీమిండియా స్వదేశంలో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కోల్‌కతా వేదికగా తొలి టెస్టు జరుగగా.. భారత జట్టు సఫారీల చేతిలో ముప్పై పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో బవుమా బృందం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

ఇక గువాహటి వేదికగా శనివారం మొదలైన రెండో టెస్టులో పంత్‌ సేన చావో రేవో తేల్చుకోవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్‌ సిరీస్‌ను 1-1తో సమం చేయగలదు. లేదంటే సొంతగడ్డపై సఫారీల చేతిలో వైట్‌వాష్‌ కాకతప్పదు. మరోవైపు.. ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌పై బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడటంతో పాటు.. తొలి టెస్టు మూడురోజుల్లోనే ముగిసిపోవడం విమర్శలకు తావిచ్చింది. 

ఈ నేపథ్యంలో గువాహటి పిచ్‌ను ఎర్రమట్టితో తయారు చేయించినట్లు తెలుస్తోంది. తొలుత బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఈ వికెట్‌.. పాతబడే కొద్ది స్పిన్నర్లకు అనుకూలించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇక్కడ టాస్‌ ఓడటం భారత జట్టుకు ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు. 

భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా రెండో టెస్టు తుదిజట్లు ఇవే
భారత్‌
కేఎల్‌ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, నితీశ్‌ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ సిరాజ్‌.

సౌతాఫ్రికా
ఐడెన్ మార్క్రమ్‌, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, తెంబా బావుమా(కెప్టెన్‌), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెన్నె (వికెట్‌ కీపర్‌), మార్కో యాన్సెన్, సెనురాన్ ముత్తుసామి, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్.

చదవండి: వైభవ్‌ మెరుపులు వృధా.. ఆసియా కప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement