సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో చావోరేవో తేల్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. గువాహటి వేదికగా శనివారం మొదలయ్యే రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) మెడ నొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కావడం ఆందోళనకరంగా పరిణమించింది.
గిల్ స్థానంలో రిషభ్ పంత్ (Rishabh Pant)ను బీసీసీఐ తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. అయితే, తుదిజట్టులో గిల్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై పంత్ స్పందిస్తూ.. తాము ఇప్పటికే గిల్ రీప్లేస్‌మెంట్ గురించి నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. కానీ ఆ ఆటగాడి పేరు మాత్రం వెల్లడించలేదు.
ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లు
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సబా కరీం (Saba Karim) కీలక వ్యాఖ్యలు చేశాడు. గువాహటిలోని బర్సపరా స్టేడియంలో తొలిసారిగా టెస్టు మ్యాచ్ జరుగుతున్న తరుణంలో.. భారత జట్టు ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లను ఆడించాలని సూచించాడు. అదే విధంగా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇవ్వాలని పేర్కొన్నాడు.
ఇందులో భాగంగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌పై వేటు వేయక తప్పదని సబా కరీం అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘శుబ్‌మన్ గిల్ లేకపోవడం టీమిండియాకు పెద్ద దెబ్బ. అయితే, ఇలాంటి సమయంలో తుది జట్టులోకి సాయి సుదర్శన్‌తో పాటు దేవ్‌దత్ పడిక్కల్‌ను కూడా తీసుకుంటే మంచిది.
అతడిపై వేటు వేయాల్సి వస్తుంది
ఆరు స్పెషలిస్టు బ్యాటర్లు.. ఇద్దరు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగాలి. గువాహటిలో గెలవాలంటే ఇదే సరైన కాంబినేషన్. కాబట్టి ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను తప్పించకతప్పదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో వైవిధ్యం కోసం అతడిపై వేటు వేయాల్సి వస్తుంది.
కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ స్పిన్నర్ల కోటాలో తుదిజట్టులో ఉంటారు. ఇక పేస్ విభాగంలో బుమ్రా, సిరాజ్ ఉండనే ఉన్నారు’’ అని సబా కరీం పేర్కొన్నాడు. సాయి, పడిక్కల్ రాకతో జట్టులో ఎడమచేతి వాటం ఆటగాళ్ల సంఖ్య పెరుగుతుందని.. అందుకే ధ్రువ్ జురెల్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డాడు. అప్పుడు లెఫ్ట్- రైట్ కాంబినేషన్ సెట్ అవుతుందని పేర్కొన్నాడు.
తొలి టెస్టులో ఆరుగురు
కాగా కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయడంతో పాటు వరుసగా 26, 17 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్.. సౌతాఫ్రికా చేతిలో 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక తొలి టెస్టులో భారత్ ఆరుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లకు తుదిజట్టులో చోటు ఇచ్చింది.
సౌతాఫ్రికాతో తొలి టెస్టు ఆడిన భారత తుదిజట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.


