హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ (Gautam Gambhir) వచ్చిన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విజయ పరంపర కొనసాగిస్తున్న టీమిండియా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతోంది. ముఖ్యంగా స్వదేశంలోనూ వరుస మ్యాచ్‌లలో ఓటమి పాలుకావడం విమర్శలకు దారితీస్తోంది.
గంభీర్ మార్గదర్శనంలో సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో టెస్టుల్లో టీమిండియా 3-0తో వైట్‌వాష్ అయింది. బంగ్లాదేశ్, వెస్టిండీస్ వంటి ఫామ్‌లోలేని జట్లపై గెలిచినా.. తాజాగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులోనూ ఓటమిని మూటగట్టుకుంది.
వేళ్లన్నీ గంభీర్ వైపే
కోల్‌కతా వేదికగా సఫారీ (IND vs SA)లు విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా 93 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ముప్పై పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై విమర్శలు రాగా.. వేళ్లన్నీ గంభీర్ వైపే చూపాయి. అతడి ఆలోచనకు తగ్గట్లే రూపొందించిన పిచ్‌పై భారత జట్టు బోల్తా పడిందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం మండిపడ్డాడు.
ఈ క్రమంలో గంభీర్ కూడా పిచ్ పరిస్థితికి తానే కారణమంటూ నైతిక బాధ్యత వహించాడు. అయినా సరే గంభీర్‌పై విమర్శల వర్షం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా స్పందించాడు. గంభీర్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందంటూ అతడికి మద్దతు పలికాడు.
బీసీసీఐ స్పందన ఇదే
‘‘మా సెలక్టర్లు, కోచింగ్ సిబ్బంది.. మరీ ముఖ్యంగా హెడ్‌కోచ్, మా ఆటగాళ్లపై బీసీసీఐకి పూర్తి నమ్మకం ఉంది. ఎవరినీ మేము తక్కువ చేయము. ప్రతి ఒక్కరికి మా మద్దతు ఉంటుంది. అందుకే మా జట్టు చాన్నాళ్లుగా అద్భుత విజయాలు సాధిస్తోంది.
అయితే, ఏదో ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన దాని గురించి సోషల్ మీడియాలో రచ్చ చేయడం సరికాదు. ఇలాంటి వాళ్లను మేము అస్సలు పట్టించుకోము. ఇదే జట్టు.. ఇదే హెడ్‌కోచ్ మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.
అదే విధంగా.. ఆసియా టీ20 కప్ టోర్నీలోనూ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ గడ్డ మీద ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది’’ అంటూ దేవజిత్ సైకియా.. గంభీర్, టీమిండియాను సమర్థించాడు. బయటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేసే విమర్శలను తాము పట్టించుకోమని రెవ్‌స్పోర్ట్స్‌తో పేర్కొన్నాడు.
కాగా గంభీర్ గైడెన్స్‌లో ఈ ఏడాది టీమిండియా చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే, స్వదేశంలో కివీస్ చేతిలో టెస్టుల్లో ఘోర పరాభవంతో పాటు ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 1-3తో చేజార్చుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని టీమిండియా కోల్పోయింది.
ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు సిరీస్‌ను 2-2తో సమం చేసింది. తాజాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు ఓడిన టీమిండియా.. గువాహటిలో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో తప్పకగెలవాల్సిందే!.. లేదంటే సొంతగడ్డపై మరో పరాభవం తప్పదు!!
చదవండి: ఎవరిని ఆడించాలో తెలుసు.. నిర్ణయం తీసుకున్నాం: రిషభ్ పంత్


