సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా సారథిగా రిషభ్ పంత్ (Rishabh Pant) ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మెడ నొప్పి కారణంగా జట్టుకు దూరం కావడంతో పగ్గాలు పంత్ చేతికి వచ్చాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన పంత్.. తనకు కెప్టెన్‌గా అవకాశం ఇచ్చినందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ధన్యవాదాలు తెలిపాడు.
నా కెప్టెన్సీ అలాగే ఉంటుంది
టీమిండియాకు సారథ్యం వహించడం సంతోషంగా ఉందన్న పంత్.. గువాహటి టెస్టులో తమ తుదిజట్టు కూర్పు గురించి స్పందించాడు. ‘‘మా బ్యాటింగ్ లైనప్‌లో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాటర్లే ఉన్నారు. కోల్‌కతాలో మేము స్పిన్నర్ల సేవలను సమర్థంగా ఉపయోగించుకోవాలని భావించాం.
పరిస్థితులు కూడా అందుకు అనుకూలించాయి. కానీ సానుకూల ఫలితం రాలేదు. ఏదేమైనా మేము సానుకూల దృక్పథంతోనే ముందుకు సాగుతాం. ఒత్తిడి దరిచేరనీయము. నా కెప్టెన్సీ సంప్రదాయబద్దంగానే ఉంటుంది. అదే సమయంలో సహజ శైలికి భిన్నంగా అవుట్-ఆఫ్-ది- బాక్స్ కూడా ఆలోచిస్తా.
ఆడాలని ఉన్నా..
నిజానికి రెండో టెస్టులో ఆడాలని శుబ్‌మన్ ఎంతగానో పరితపించాడు. కానీ అతడి ఆరోగ్యం అందుకు సహకరించలేదు. గువాహటిలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఇది. అందుకే మాతో పాటు ప్రేక్షకులకూ ఇది ప్రత్యేకం.
పిచ్ తొలుత బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండవచ్చు. ఆతర్వాత స్పిన్నర్లు ప్రభావం చూపగలరు’’ అని పంత్ పేర్కొన్నాడు. ఇక గంభీర్ మార్గదర్శనంలో ఆల్‌రౌండర్లకు ఎక్కువగా ప్రాధాన్యం దక్కుతోందన్న విలేకరుల మాటలకు స్పందిస్తూ..
‘‘జట్టు కూర్పు సమతూకంగా ఉండాలి. కొన్నిసార్లు స్పెషలిస్టు ప్లేయర్ల కంటే కూడా ఆల్‌రౌండర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. పిచ్ పరిస్థితులకు తగ్గట్లు వారు తమ పాత్రకు న్యాయం చేయగలరు. టీమ్ బ్యాలెన్స్ దృష్ట్యానే ఆల్‌రౌండర్లను ఎంపిక చేస్తామే తప్ప.. టెస్టు స్పెషలిస్టులను పక్కనపెట్టాలని కాదు’’ అని పంత్ స్పష్టం చేశాడు.
ఎవరిని ఆడించాలో తెలుసు.. నిర్ణయం తీసుకున్నాం
అదే విధంగా.. గిల్ స్థానంలో తుదిజట్టులోకి ఎవరు వస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఈ విషయంలో మేము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. గిల్ ప్లేస్‌లో ఎవరు ఆడతారో.. ఆ ప్లేయర్‌కు తెలుసు’’ అంటూ తాత్కాలిక కెప్టెన్ పంత్ మాట దాటవేశాడు.
కాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలో తొలి టెస్టు జరిగింది. ఇందులో భారత జట్టు సఫారీల చేతిలో ముప్పై పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గువాహటిలో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో గెలిస్తేనే టీమిండియా పరువు నిలుస్తుంది.
ఇక కోల్‌కతా టెస్టులో టీమిండియా ఏకంగా ఆరుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లతో బరిలోకి దిగింది. యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లను ఆడించింది. వీరితో పాటు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, శుబ్‌మన్ గిల్ సఫారీలతో తొలి టెస్టులో భాగమయ్యారు.


