Ashes: చరిత్ర సృష్టించిన మిచెల్‌ స్టార్క్‌ | Starc Dismisses Joe Root Completes 100 Ashes Wickets Becomes | Sakshi
Sakshi News home page

Ashes: చరిత్ర సృష్టించిన మిచెల్‌ స్టార్క్‌

Nov 21 2025 11:10 AM | Updated on Nov 21 2025 12:06 PM

Starc Dismisses Joe Root Completes 100 Ashes Wickets Becomes

ఆస్ట్రేలియా- ఇంగ్లండ్‌ (AUS vs ENG) మధ్య ప్రతిష్టాత్మక యాషెస్‌ (The Ashes) తాజా ఎడిషన్‌ శుక్రవారం మొదలైంది. పెర్త్‌ వేదికగా తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుని.. ఆతిథ్య ఆసీస్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ (Mitchell Starc) ఆదిలోనే ఇంగ్లండ్‌కు కోలుకోలేని షాకిచ్చాడు. తొలి ఓవర్లోనే ఓపెనర్‌ జాక్‌ క్రాలీని అవుట్‌ చేశాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో ఖవాజాకు క్యాచ్‌ ఇచ్చిన క్రాలీ.. ఆరు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు.

ముచ్చటగా మూడు
అనంతరం ఏడో ఓవర్‌ నాలుగో బంతికి స్టార్క్‌ మరోసారి తన బౌలింగ్‌ పదును చూపించాడు. మరో ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (21)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇదే జోరులో తొమ్మిదో ఓవర్‌ ఐదో బంతికి మరో కీలక వికెట్‌ను స్టార్క్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఉన్న ఇంగ్లండ్‌ దిగ్గజం జో రూట్‌ను స్టార్క్‌ డకౌట్‌ చేశాడు.

వంద వికెట్ల క్లబ్‌లో
తద్వారా మూడు కీలక వికెట్లు కూల్చిన స్టార్క్‌.. యాషెస్‌ సిరీస్‌లో ఓవరాల్‌గా వంద వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన 13వ ఆస్ట్రేలియన్‌గా... అదే విధంగా.. 21వ బౌలర్‌గా ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ చరిత్రకెక్కాడు. కేవలం 23 టెస్టుల్లోనే (యాషెస్‌) స్టార్క్‌ వంద వికెట్ల క్లబ్‌లో చేరడం విశేషం.

అంతేకాదు.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు సందర్భంగా కర్ట్లీ ఆంబ్రోస్‌ రికార్డును కూడా స్టార్క్‌ సమం చేశాడు. టెస్టుల్లో 405 వికెట్లు పూర్తి చేసుకుని.. ఆంబ్రోస్‌ సరసన నిలిచాడు. తద్వారా వసీం అక్రం (పాకిస్తాన్‌- 414) తద్వారా అత్యధిక టెస్టు వికెట్లు కూల్చిన రెండో లెఫ్టార్మ్‌ పేసర్‌గా స్టార్క్‌ రికార్డు సాధించాడు. 

కాగా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో యాషెస్‌ ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టులో స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ ఇప్పటికే 110 వికెట్లు పూర్తి చేసుకోగా.. స్టార్క్‌ తాజాగా 100 వికెట్ల క్లబ్‌లో చేరాడు.

ఇక స్టార్క్‌తో పాటు కామెరాన్‌ గ్రీన్‌ కూడా రాణించడంతో ఇంగ్లండ్‌ 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. నిలకడగా ఆడుతున్న వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ (46)ను గ్రీన్‌ ఎల్బీడబ్ల్యూ చేసి ఆసీస్‌కు మంచి బ్రేక్‌ ఇచ్చాడు. ఫలితంగా భోజన విరామ సమయానికి ఇంగ్లండ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 105 పరుగులు మాత్రమే చేసింది.
UPDATE: ఏడేసిన మిచెల్‌ స్టార్క్‌.. కుప్పకూలిన ఇంగ్లండ్‌
చదవండి: SL vs ZIM: శ్రీలంక‌కు షాకిచ్చిన జింబాబ్వే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement