ముక్కోణపు టీ20 టోర్నమెంట్ తొలి పోరులో ఆతిథ్య పాకిస్తాన్ చేతిలో ఓడిన జింబాబ్వే... ఆ పరాజయం నుంచి వేగంగా కోలుకొని సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి టోర్నీలో బోణీ కొట్టింది. గురువారం రావల్పిండి వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో జింబాబ్వే 67 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.
టీ20ల్లో శ్రీలంకతో పదోసారి ఆడిన జింబాబ్వే మూడో విజయాన్ని అందుకుంది. ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. బ్రియాన్ బెనెట్ (42 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ సికందర్ రజా (32 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడారు.
వీరిద్దరూ మూడో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగ 3 వికెట్లు పడగొట్టగా... ఇషాన్ మలింగ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక పూర్తిగా విఫలమై 95 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ దసున్ షనక (25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాజపక్స (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 3, రిచర్డ్ నగరవా 2 వికెట్లు తీశాడు.
చదవండి: ‘యాషెస్’ సమరానికి సిద్ధం


