
హరారే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో జింబాబ్వే బౌలర్లు నిప్పులు చేరిగారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. జింబాబ్వే బౌలర్ల దాటికి 17.4 ఓవర్లలో కేవలం 80 పరుగులకే కుప్పకూలింది. ఆరంభం నుంచే శ్రీలంక బ్యాటర్లకు కష్టాలు ఎదురయ్యాయి.
శ్రీలంక ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో తన వేసిన తొలి బంతికే ముజారబానీ.. స్టార్ బ్యాటర్ కుశాల్ మెండిస్(1) ఔట్ చేసి పర్యాటక జట్టుకు షాకిచ్చాడు. ఆ తర్వాత శ్రీలంక వికెట్లు పతనం కొనసాగింది. టాపర్డర్, మిడిలార్డర్, లోయార్డర్ అన్న తేడా లేకుండా లంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
శ్రీలంక బ్యాటర్లలో కమిల్ మిశ్రా 20 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం ఏడు మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఈవెన్స్, కెప్టెన్ సికిందర్ రజా తలా మూడు వికెట్లు పడగొట్టి లంకేయుల పతనాన్ని శాసించారు.
వీరిద్దరితో పాటు ముజారబానీ రెండు, విలియమ్స్ ఒక్క వికెట్ సాధించారు. కాగా టీ20ల్లో శ్రీలంకకు ఇది రెండో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. ఇంతకుముందు టీ20 వరల్డ్‌కప్-2024లో సౌతాఫ్రికాపై శ్రీలంక కేవలం 77 పరుగులకే ఆలౌటైంది.
అదేవిధంగా జింబాబ్వే గడ్డపై టీ20ల్లో అత్యల్ప టోటల్‌ను నమోదు చేసిన మూడో జట్టుగా లంక చెత్త రికార్డును మూట కట్టకుంది. ఈ జాబితాలో జింబాబ్వే అగ్రస్ధానంలో ఉంది. 2024లో బులవాయో వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 57 పరుగులకే ఆలౌటైంది.
చదవండి: Anshul Kamboj: మరో జహీర్ అన్నారు.. కట్ చేస్తే! ఒక మ్యాచ్‌కే ఖేల్ ఖతం