పాకిస్తాన్‌లో రేపటి నుంచి (నవంబర్ 18) ప్రారంభం కాబోయే ముక్కోణపు సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టుకు భారీ షాక్ తగిలింది. జింబాబ్వే కూడా పాల్గొంటున్న ఈ టోర్నీకి ఆ జట్టు కెప్టెన్ చరిత్ అసలంక (Charith Asalanka) దూరమయ్యాడు (అనారోగ్యం కారణంగా).
అసలంక తప్పుకోవడంతో వైస్ కెప్టెన్ దసున్ శనక (Dasun Shanaka) సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. కెప్టెన్‌గా షనక నియామకాన్ని లంక క్రికెట్ బోర్డు ఇవాళ అధికారికంగా ప్రకటించింది.
అసలంకతో పాటు మరో లంక బౌలర్ కూడా పాక్ ట్రై సిరీస్‌కు దూరమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ అసిత ఫెర్నాండో కూడా అనారోగ్యంతో బాధపడుతూ స్వదేశానికి తిరిగి వెళ్లాడు. ఈ ట్రై సిరీస్‌లో శ్రీలంక తమ తొలి మ్యాచ్‌ను నవంబర్ 20న ఆడనుంది. రావల్పిండి వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడనుంది.
పాక్ ట్రై సిరీస్‌కు శ్రీలంక క్రికెట్ జట్టు (Up dated)..
పతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక (కెప్టెన్), కమిందు మెండిస్, భానుక రాజపక్స, జనిత్ లియానాగే, వనిందు హసరంగ, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, దుష్మంత చమీర, నువాన్ తుషార, ఎషాన్ మలింగ.
షనక నాయకత్వ అనుభవం
షనక లంక కెప్టెన్సీ బాధ్యతలు మోయడం కొత్తేమీ కాదు. 2019 సెప్టెంబర్‌లో తొలిసారి శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అప్పటి నుంచి 2023 వరకు జట్టును ముందుండి నడిపించాడు. షనక నాయకత్వంలో శ్రీలంక 48 T20I మ్యాచ్‌లలో 22 విజయాలు సాధించి, 24 ఓటములను ఎదుర్కొంది. రెండు మ్యాచ్‌లు టై అయ్యాయి.
పాక్ చేతిలో చిత్తు
ట్రై సిరీస్‌కు ముందు పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌లో వన్డే సిరీస్‌లో శ్రీలంక చిత్తుగా ఓడింది. ఈ సిరీస్‌ను ఆతిథ్య పాక్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.నిన్ననే ముగిసిన చివరి మ్యాచ్‌లో పాక్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.


