గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ ఆడుతూ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.
వాస్తవానికి బాబర్ నుంచి ఇంకా చాలా రావాల్సి ఉన్నా.. ఇటీవలికాలంలో అతని పరిస్థితిని బట్టి చూస్తే ఇది కాస్త బెటరే అనిపిస్తుంది. ఎందుకంటే ఇతగాడు రెండేళ్లకు పైగా అంతర్జాతీయ కెరీర్‌లో (మూడు ఫార్మాట్లు) శతకం లేకుండా గడిపాడు. అప్పుడెప్పుడో 2023లో పసికూన నేపాల్‌పై సెంచరీ చేసిన బాబర్.. ఇటీవలే (ఈ ఏడాది నవంబర్) శ్రీలంకపై మళ్లీ సెంచరీ చేశాడు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాబర్ నుంచి అర్ద సెంచరీ కూడా గొప్పగా అనిపిస్తుంది. తాజాగా బిగ్ బాష్ లీగ్‌లో బాబర్ చేసిన అర్ద సెంచరీలకు ఇంత ప్రాధాన్యత లభించడానికి మరో కారణం ఉంది.
టీ20 ఫార్మాట్‌లో ఇటీవలికాలంలో అతడి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎంతలా అంటే.. ప్రపంచకప్ జట్టులో అతని స్థానం కూడా ప్రశ్నార్థకంగా మారింది. పాక్ సెలెక్టర్లు బాబర్ ప్రత్యామ్నాయాన్ని వెతికే పనిలో కూడా పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు అర్ద సెంచరీలు అతని ప్రపంచకప్ బెర్త్ ఆశలను సజీవంగా ఉంచాయి.
ఇదే ఫామ్‌ను బాబర్ మరో ఐదారు మ్యాచ్‌ల్లో కొనసాగిస్తే ప్రపంచకప్ బెర్త్‌కు ఢోకా ఉండదు. ఇక్కడ బాబర్‌కు మరో సమస్య కూడా ఉంది. తాజాగా అతను రెండు అర్ద సెంచరీలు చేసినా, అవి పొట్టి ఫార్మాట్‌కు కావాల్సిన వేగంతో చేసినవి కావు.
సిడ్నీ థండర్‌పై 42 బంతులు ఆడి 58 పరుగులు మాత్రమే చేశాడు. తాజాగా మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌పై 46 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో అజేయమైన 58 పరుగులు చేశాడు. రెనెగేడ్స్‌పై బాధ్యతాయుత అర్ద సెంచరీతో మ్యాచ్‌ను గెలిపించినా, బాబర్‌లో మునుపటి వేగం లేదని స్పష్టంగా తెలిసింది.
కాగా, బాబర్ హాఫ్ సెంచరీ, సీన్ అబాట్ (4-0-16-3) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కారణంగా రెనెగేడ్స్‌పై సిడ్నీ సిక్సర్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరగులు చేసింది.
జోష్ బ్రౌన్ (43), మెక్‌గుర్క్ (38), హసన్ ఖాన్ (39) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. సిక్సర్స్ బౌలర్లలో అబాట్‌తో పాటు జాక్ ఎడ్వర్డ్స్, డ్వార్షుయిస్, హేడెన్ కెర్ తలో 2 వికెట్లు తీశారు.
అనంతరం ఛేదనలో సిక్సర్స్ సైతం ఆదిలోన తడబడినప్పటికీ.. బాబర్-జోయెల్ డేవిడ్ (34 నాటౌట్) జోడీ సిక్సర్స్‌ను గెలిపించింది. 19.1 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.


