మహిళా క్రికెట్ అభిమానులకు శుభవార్త. నాలుగో ఎడిషన్ మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) వచ్చే ఏడాది జనవరి 7 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరుగనున్నట్లు తెలుస్తుంది. వేదికలుగా ముంబై, బరోడా నగరాలు ఖరారైనట్లు సమాచారం.
నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో సీజన్ ప్రారంభ మ్యాచ్‌లు (తొలి అర్ద భాగం) జరగనున్నాయని తెలుస్తుంది. ఇటీవల మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు వేదికైన ఈ స్టేడియం, భారత మహిళా క్రికెటర్లకు అచ్చొచ్చిన మైదానంగా పేరుగాంచింది.
బరోడాలోని కోటంబి స్టేడియంలో ఫైనల్ సహా రెండో అర్ద భాగం మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. జనవరి 11న భారత్–న్యూజిలాండ్ పురుషుల వన్డే తర్వాత బరోడా లెగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.
పై విషయాలపై అధికారిక సమాచారాన్ని నవంబర్ 27న న్యూఢిల్లీలో జరిగే వేలం సమయంలో ప్రకటించే అవకాశం ఉంది. వేదికల కోసం లక్నో, బెంగళూరు నగరాలు కూడా పోటీపడినప్పటికీ, ముంబై, బరోడాకే అవకాశం దక్కిందని తెలుస్తుంది.
కాగా, గత ఎడిషన్ డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆ ఫ్రాంచైజీ రెండో టైటిల్‌ను కైవసం చేసుకుంది. గత సీజన్ మ్యాచ్‌లు వడోదర, బెంగళూరు, లక్నో, ముంబై నగరాల్లో జరిగాయి. ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగాయి.
గత ఎడిషన్ మ్యాచ్‌లు ఫిబ్రవరి, మార్చినెలల్లో జరగ్గా, ఈసారి జనవరి విండోను ఫిక్స్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే పురుషుల టీ20 వరల్డ్ కప్-2026 ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది.


