ఐపీఎల్-2026 వేలానికి ముందు ఓ దేశవాలీ బౌలర్ పిచ్చెక్కించే ప్రదర్శనతో చెలరేగాడు. రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా హర్యానాతో జరుగుతున్న మ్యాచ్‌లో అదిరిపోయే గణాంకాలతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సర్వీసస్ స్పిన్నర్ అమిత్ శుక్లా 20 ఓవర్లలో కేవలం 27 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు. ఓ దశలో శుక్లా (Amit Shukla) పరుగులేమీ ఇవ్వకుండా 5 వికెట్లు తీశాడు.
ఈ సంచలన ప్రదర్శనతో శుక్లా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్శించాడు. వచ్చే నెలలో జరుగబోయే వేలంలో ఫ్రాంచైజీలు ఇతగాడి కోసం ఎగబడే అవకాశం ఉంది. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ కావడం శుక్లా అదనంగా కలిసి రావచ్చు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు చెందిన శుక్లా అడపాదడపా బ్యాటింగ్ (కుడి చేతి) కూడా చేయగలడు. 22 ఏళ్ల శుక్లా అండర్-19 విభాగంలో పంజాబ్ తరఫున ఆడాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన శుక్లా 32 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్‌లో ఓ అర్ద సెంచరీ సాయంతో 138 పరుగులు చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో శుక్లా కేవలం ఏడు ఇన్నింగ్స్‌ల్లోనే 23 వికెట్లు తీసి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్శిస్తున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సర్వీసస్ 216 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.
అంతకుముందు అమిత్ శుక్లా మాయాజాలం దెబ్బకు హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో 111 పరుగులకే కుప్పకూలింది. శుక్లా కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలతో హర్యానా నడ్డి విరిచాడు. దీనికి ముందు సర్వీసస్ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే ఆలౌటైంది.
చదవండి: షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న భారత్, పాక్ క్రికెటర్లు


