
సీన్ విలియమ్స్ (PC: X)
జింబాబ్వే వెటరన్ క్రికెటర్ సీన్ విలియమ్స్ (Sean Williams)సరికొత్త అధ్యాయం లిఖించాడు. అంతర్జాతీయ టీ20లలో సుదీర్ఘకాలం కొనసాగిన ఆటగాడిగా అవతరించాడు. తద్వారా ఇన్నాళ్లు.. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan) పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు.
శ్రీలంకతో తాజా టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ సందర్భంగా సీన్ విలియమ్స్ ఈ ఘనత సాధించాడు. కాగా రెండు వన్డేలు, మూడు టీ20లు ఆడే నిమిత్తం శ్రీలంకక్రికెట్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. 2-0తో జింబాబ్వే క్లీన్‌స్వీప్ అయింది.
రిటైర్మెంట్ ప్రకటించి..
ఈ క్రమంలో బుధవారం టీ20 సిరీస్ మొదలుకాగా.. సీన్ విలియమ్స్ పునరాగమనం చేశాడు. దాదాపు ఏడాది విరామం తర్వాత మళ్లీ జింబాబ్వే టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. కాగా 38 ఏళ్ల సీన్ విలియమ్స్.. గతేడాది మే 12న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
అయితే, టీ20 ప్రపంచకప్-2026 ఆఫ్రికన్ క్వాలిఫయర్స్ నేపథ్యంలో రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విలియమ్స్.. సెప్టెంబరులో జరిగే ఈ మ్యాచ్‌లలో పాల్గొనున్నాడు. అయితే, అంతకంటే ముందు లంకతో సొంతగడ్డపై సిరీస్ సందర్భంగానే రీఎంట్రీ ఇచ్చేశాడు.
ప్రపంచ రికార్డు
హరారే వేదికగా శ్రీలంకతో తొలి టీ20 సందర్భంగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సీన్ విలియమ్స్.. 11 బంతులు ఎదుర్కొని.. రెండు ఫోర్ల సాయంతో 14 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, ఆట పరంగా రాణించకపోయినా.. సుదీర్ఘ అంతర్జాతీయ టీ20 క్రికెట్ ప్రయాణంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
2006 నుంచి..
కాగా 2006లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా సీన్ విలియమ్స్ జింబాబ్వే తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు తన 82 టీ20లు ఆడి 1705 పరుగులు సాధించాడు. అదే విధంగా.. 24 టెస్టుల్లో 1946, 164 వన్డేల్లో 5217 రన్స్ రాబట్టాడు.
కాగా తాజా రీఎంట్రీతో సీన్ విలియమ్స్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో 18 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. ప్రపంచంలో సుదీర్ఘకాలం ఇలా ఇంటర్నేషనల్ టీ20లలో కొనసాగుతున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత బంగ్లా దిగ్గజం షకీబ్ అల్ హసన్ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో సుదీర్ఘ కెరీర్ కలిగి ఉన్న క్రికెటర్లు
🏏సీన్ విలియమ్స్ (జింబాబ్వే)- 2006- 2025* - 18 ఏళ్ల 279 రోజులు- 129 మ్యాచ్‌లు
🏏షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 2006- 2024- 17 ఏళ్ల 166 రోజులు- 82 మ్యాచ్‌లు
🏏మహ్మదుల్లా (బంగ్లాదేశ్)- 2007- 2024- 17 ఏళ్ల 41 రోజులు- 141 మ్యాచ్‌లు
🏏రకీప్ పటేల్ (కెన్యా)- 2008- 2025- 16 ఏళ్ల 357 రోజులు- 88 మ్యాచ్‌లు
🏏రిచర్డ్ బెర్రింగ్‌టన్ (స్కాట్లాండ్)- 2008- 2005- 16 ఏళ్ల 343 రోజులు- 102 మ్యాచ్‌లు
🏏రోహిత్ శర్మ (ఇండియా)- 2007- 2024- 16 ఏళ్ల 2024- 16 ఏళ్ల 284 రోజులు- 159 మ్యాచ్‌లు.
చదవండి: ఇంకెంత రెస్ట్ కావాలి: రోహిత్‌పై గంభీర్ ఫైర్.. నాడు..