
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీ ఆరంభానికి సమయం సమీపిస్తున్న తరుణంలో పాత ఘటనలు మరోసారి తెరమీదకు వస్తున్నాయి. ఈ క్రమంలో 2022 నాటి ఆసియా కప్ ఈవెంట్ సందర్భంగా రోహిత్ శర్మపై ప్రస్తుత టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఆనాడు ఏమైంది?!... 2022లో పొట్టి ఫార్మాట్లో ఆసియా కప్ టోర్నీని నిర్వహించారు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్లో లీగ్ దశలో టీమిండియా పాకిస్తాన్, హాంకాంగ్ జట్లపై గెలిచి సూపర్-4 దశకు చేరుకుంది.
పాక్, లంక చేతిలో ఓడిన రోహిత్ సేన
అయితే, అనూహ్య రీతిలో పాకిస్తాన్, శ్రీలంక చేతిలో ఓడి ఫైనల్ చేరకుండానే రోహిత్ సేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్‌తో జరిగిన నామమాత్రపు టీ20కి రోహిత్ శర్మ దూరమయ్యాడు. సెలక్టర్లు అతడికి విశ్రాంతినిచ్చారు.
ఇంకెంత రెస్ట్ కావాలి?
ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ (Gautam Gambhir) నాడు స్పందిస్తూ.. ‘‘అతడికి ఇంకెంత రెస్ట్ కావాలి?.. ఇప్పటికే కావాల్సినంత విశ్రాంతి దొరికింది కదా!.. నా అభిప్రాయం ప్రకారం రోహిత్ శర్మ ఇప్పటి నుంచి ప్రతి ఒక్క టీ20 మ్యాచ్ ఆడాల్సిందే.
టీ20 ప్రపంచకప్-2024కు సిద్ధమవ్వాలంటే ఇప్పటి నుంచే ఆటపై మరింత ఎక్కువగా దృష్టి సారించాలి’’ అని న్యూస్18తో పేర్కొన్నాడు. కాగా శ్రీలంకతో మ్యాచ్ తర్వాత రెండురోజులకు అఫ్గనిస్తాన్‌తో నాడు మ్యాచ్ జరిగింది. ఇక ఆ టోర్నీలో ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక విజేతగా అవతరించింది.
భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన రోహిత్
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ.. మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఈ ఘనత సాధించిన భారత రెండో కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. ఇక ఈ టోర్నీ ముగిసిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన హిట్‌మ్యాన్.. ఇటీవలే టెస్టుల నుంచి కూడా తప్పుకొన్నాడు.
ఇక ఈ ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్‌కు టైటిల్ అందించిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం వన్డేలతో పాటు ఐపీఎల్‌లనూ కొనసాగుతున్నాడు. మరోవైపు.. టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత రాహుల్ ద్రవిడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోగా.. గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్ అయ్యాడు.
ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 9- 28 వరకు తాజా ఆసియా కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈసారి పొట్టి ఫార్మాట్లో జరిగే ఈ ఈవెంట్‌కు వేదిక యూఏఈ. భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పాల్గొంటున్నాయి.