
బీసీసీఐపై నెటిజన్ల విమర్శలు
ఆసియా కప్-2025 టోర్నమెంట్, ఆ తర్వాత వరుస సిరీస్‌ల నేపథ్యంలో ఇప్పటికే భారత ఆటగాళ్లలో చాలా మంది ఫిట్‌నెస్ పరీక్షకు హాజరయ్యారు. బెంగళూరులో నిర్వహించిన టెస్టుల్లో వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), టెస్టు సారథి శుబ్‌మన్ గిల్, టీ20 జట్టు నాయకుడు సూర్యకుమార్ యాదవ్ పాసయ్యారు.
వీరితో పాటు మహ్మద్ సిరాజ్, జితేశ్ శర్మ (Jitesh Sharma), ప్రసిద్ కృష్ణ, రుతురాజ్ గైక్వాడ్, అభినవ్ మనోహర్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, సంజూ శాంసన్, శివం దూబే, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, ముకేశ్ కుమార్, హార్దిక్ పాండ్యా (Hardik Pandya), ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్ తదితరులు ఫిట్‌నెస్ పరీక్ష పూర్తి చేసుకున్నట్లు సమాచారం.
వారంతా రెండో దశలో..
ఇక రెండో దశలో భాగంగా రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ నెలలో ఫిట్‌నెస్ పరీక్ష పూర్తిచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆటగాళ్లంతా బెంగళూరులో ఫిట్‌నెస్ పరీక్షకు హాజరైతే.. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి మాత్రం లండన్‌లోనే ఉన్నాడు.
లండన్‌లోనే కోహ్లి ఫిట్‌నెస్ టెస్టు
అక్కడే కోహ్లి ఫిట్‌నెస్ పరీక్షలో పాల్గొన్నట్లు సమాచారం. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి కోహ్లి ముందుగానే అనుమతి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, టీమిండియా అభిమానులు మాత్రం దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘కోహ్లి భారత్‌లో కంటే లండన్‌లోనే ఎక్కువగా ఉంటాడు.
తన కుటుంబమంతా అక్కడే ఉంటుంది. మ్యాచ్‌లు, ఐపీఎల్ ఉన్నపుడు మాత్రమే ఇండియాకు వస్తాడు. ఇప్పుడు ఫిట్‌నెస్ టెస్టు కూడా అక్కడేనా?.. అసలు బీసీసీఐ ఎందుకిలా చేస్తోంది?..
అతడు ఏమైనా స్పెషలా? వేరేదేశంలో ఫిట్‌నెస్ టెస్టుకు ఎలా అనుమతినిస్తారు? మాకైతే ఇప్పుడు కోహ్లి ఇంగ్లండ్ క్రికెటర్ ఏమో అనే డౌట్ వస్తోంది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ, కోహ్లి తీరును ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.
ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా రీఎంట్రీ
కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇటీవలే టెస్టుల నుంచి కూడా వైదొలిగాడు. ప్రస్తుతం వన్డే, ఐపీఎల్‌లో కొనసాగుతున్న ఈ దిగ్గజ బ్యాటర్.. తదుపరి ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఇదిలా ఉంటే.. చివరగా ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టులు ఆడిన టీమిండియా.. తదుపరి ఆసియా కప్-2025 టోర్నీలో పాల్గొననుంది. సెప్టెంబరు 9-28 వరకు పొట్టి ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీకి యూఏఈ వేదిక.