
ఆసియాకప్-2025 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలి అడుగు వేసింది. ఈ మెగా టోర్నీకి 17 మంది సభ్యులతో కూడిన జట్టును పీసీబీ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా సల్మాన్ అలీ అఘా ఎంపికయ్యాడు. అదేవిధంగా స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లపై సెలక్టర్లు వేటు వేశారు.
అయితే జట్టు ప్రకటన అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గోన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు హై-పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ ఆకిబ్ జావేద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియాకప్‌లో భారత జట్టును ఓడించే సత్తా పాక్‌కు ఉందని జావేద్ అభిప్రాయపడ్డాడు. జట్టులోని ప్రతీ ఆటగాడు టీమిండియా విసిరే సవాల్‌కు సిద్ధంగా ఉన్నారని ఈ పాక్ మాజీ పేసర్ తెలిపాడు.
కాగా పాకిస్తాన్‌పై టీ20ల్లో భారత్‌కు అద్బుతమైన రికార్డు ఉంది. కానీ పాక్ జట్టు మాత్రం ఆసియా కప్-2022లో విజయాన్ని పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు ఇరు జట్లు 13 మ్యాచ్‌లలో ముఖాముఖి తలపడగా.. భారత్ తొమ్మిది మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పాకిస్తాన్ మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పాక్ చివరగా దుబాయ్‌లో జరిగిన 2022 ఆసియా కప్ సూపర్ ఫోర్‌లో భారత్‌పై టీ20 విజయం సాధించింది.
"పాకిస్తాన్ టీ20 జట్టు టీమిండియాను ఓడించగలదు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే భారీ అంచనాలు ఉంటాయి. కానీ మేము ఎంపిక చేసిన ఈ 17 మంది సభ్యుల జట్టు ఏ టీమ్‌నైనా ఓడించగలదు. అయితే వారిపై మేము ఎటువంటి ఒత్తిడి తీసుకురావడం లేదు.
ఈ జట్టుపై నాకు చాలా నమ్మకం ఉంది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లను మేము పూర్తిగా పక్కన పెట్టలేదు. ప్రస్తుత ప్రదర్శనల ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేశాము. సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఫఖార్ జమాన్ వంటి ఆటగాళ్లు అద్బుతంగా రాణిస్తున్నారు.
అందుకే వారిని జట్టులో కొనసాగించాము. సైమ్ తన రీ ఎంట్రీలో కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ ఆ తర్వాత తన రిథమ్‌ను అందుకున్నాడు. ప్రతీ ప్లేయర్‌కు జట్టులోకి తిరిగొచ్చేందు ఎల్లప్పుడూ తలపులు తెరిచే ఉంటాయి. ఎవరు మెరుగైన ప్రదర్శన చేస్తే వారు ఖచ్చితంగా జట్టులో ఉంటారు. వారే పాక్ తరపున ఆడటానికి అర్హులు" జావేద్ పేర్కొన్నాడు.
ఆసియా కప్-2025 కోసం పాక్ జట్టు..
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్
చదవండి: Asia Cup 2025: పాక్-భారత్ మ్యాచ్‌కు భారీ డిమాండ్.. 10 సెకన్లకు రూ.16 లక్షలు!