
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరుపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. దేశం కంటే మీకు ఆటే ముఖ్యమా అంటూ బోర్డు పెద్దల్ని ప్రశ్నించాడు. క్రికెట్ కంటే సైనికుల త్యాగం ఎంతో గొప్పదని.. కాబట్టి ఇప్పటికైనా ఆసియా కప్-2025 (Asia Cup) విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించాడు.
పాక్‌తో మ్యాచ్ బహిష్కరించిన ఇండియా చాంపియన్స్
ఇటీవల పహల్గామ్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి అమాయక పర్యాటకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో తీవ్రంగా స్పందించిన భారత సైన్యం.. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఇందుకు పాక్ సైన్యం ప్రతిస్పందించగా.. దాయాదికి కూడా గట్టిగానే బుద్ధి చెప్పింది.
ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొనగా.. ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీలో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ (IND vs PAK)తో మ్యాచ్‌ను బహిష్కరించారు. సెమీ ఫైనల్లో దాయాదితో పోటీ పడాల్సి ఉండగా.. తమకు అన్నింటికంటే దేశమే ముఖ్యమని శిఖర్ ధావన్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్ నుంచి కూడా నిష్క్రమించారు.
ఆసియా కప్‌లో మాత్రం దాయాదితో పోరుకు సై!
అయితే, ఆసియా కప్ టీ20 టోర్నీ-2025లో మాత్రం భారత్- పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉండటంతో పాటు.. అత్యధికంగా మూడుసార్లు ముఖాముఖి పోటీ పడే అవకాశం ఉన్నట్లు షెడ్యూల్ ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మీకు ఆటే ముఖ్యమా?
పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్‌లను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ముందుగా నిర్ణయించిన ప్రకారం మ్యాచ్‌లు యథావిధిగా సాగనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ స్పందించాడు. ‘‘వారికి (బీసీసీఐ) ఏది ముఖ్యమో.. ఏది ప్రాధాన్యం లేని విషయమో అర్థం కావడం లేదు.
సరిహద్దులో నిలబడి ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడే సైనికుల కుటుంబాలు.. తరచూ వారిని చూడలేవు. ఒక్కోసారి సైనికులు తమ ప్రాణాలనే త్యాగం చేయాల్సి వస్తుంది. వాళ్లు ఎప్పటికీ ఇంటికి తిరిగా రాలేరు కూడా!
వారి త్యాగమే ఎంతో గొప్పది
అందరి కంటే వారి త్యాగమే ఎంతో గొప్పది. వారితో పోలిస్తే ఇలాంటివి చాలా చిన్న విషయాలు. వారి కోసం మనం ఒక్క క్రికెట్ మ్యాచ్‌ను వదులుకోలేమా? మన ప్రభుత్వం కూడా ‘హింస- త్యాగం’ ఒకేచోట ఉండలేవని చెప్తోంది.
కొంత మంది సరిహద్దులో యుద్ధం చేస్తున్నపుడు.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నపుడు.. మనం మాత్రం వెళ్లి వాళ్లతో క్రికెట్ ఆడటమా?.. సమస్య పరిష్కారమయ్యేంత వరకు క్రికెట్ అనేది చిన్న విషయంలా చూడాలి. దేశ ప్రయోజనాలే మనకు ప్రథమ ప్రాధాన్యం కావాలి.
మనకు ఏ గుర్తింపు వచ్చినా.. అది దేశం కారణంగానేనని గుర్తుపెట్టుకోండి. మీరొక ఆటగాడు లేదంటే నటుడు.. ఎవరైనా కానీవండి. దేశం కంటే ఎవరూ గొప్పవారు కాదు. దేశం తరఫున తప్పక నిర్వర్తించాల్సిన విధులను విస్మరించకూడదు’’ అంటూ భజ్జీ బీసీసీఐ తీరును ఎండగట్టాడు.
చదవండి: Shai Hope: వన్డే క్రికెట్ చరిత్రలో మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్