75 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్స్‌లతో 157
గోవాపై ముంబై ఘన విజయం
ఒడిశా చేతిలో ఢిల్లీ ఓటమి
బుధవారం 19 శతకాలు నమోదు
విజయ్ హజారే వన్డే టోర్నమెంట్
జైపూర్: భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (75 బంతుల్లో 157; 9 ఫోర్లు, 14 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 87 పరుగుల తేడాతో గోవాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 444 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సర్ఫరాజ్ భారీ సెంచరీతో కదం తొక్కగా... ముషీర్ ఖాన్ (60; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్ తమోర్ (53; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
యశస్వి జైస్వాల్ (46; 6 ఫోర్లు), కెప్టెన్ శార్దుల్ ఠాకూర్ (27; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), షమ్స్ ములానీ (22; 2 సిక్స్‌లు), తనుశ్ కొటియాన్ (23 నాటౌట్; 3 ఫోర్లు) కూడా బ్యాట్‌లకు పనిచెప్పారు. ఫలితంగా ముంబై జట్టు భారీ స్కోరు చేయగలిగింది. మొత్తంగా ముంబై బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో 35 ఫోర్లు, 25 సిక్స్‌లు బాదారు. గోవా బౌలర్లలో దర్శన్ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో తుదికంటా పోరాడిన గోవా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (24; 5 ఫోర్లు), కశ్యప్ (21; 4 ఫోర్లు), స్నేహల్ (27; 3 ఫోర్లు, 1 సిక్స్), సుయాశ్ ప్రభుదేశాయ్ (31; 2 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేయగా... అభినవ్ (70 బంతుల్లో 100; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీ బాదగా... కెప్టెన్ దీప్‌రాజ్ (28 బంతుల్లో 70; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), లలిత్ యాదవ్ (64; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలు బాదారు.
ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3, యశస్వి జైస్వాల్ రెండు వికెట్లు పడగొట్టారు. గ్రూప్ ‘సి’లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ముంబై జట్టు 16 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్ 229 పరుగుల తేడాతో సిక్కింపై... పంజాబ్ 6 వికెట్ల తేడాతో హిమాచల్ ప్రదేశ్‌పై... మహారాష్ట్ర 129 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌పై గెలుపొందాయి.
రిషబ్ పంత్ విఫలం
త్వరలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో... మెరుగైన ప్రదర్శన చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్శింస్తాడనుకున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిరాశ పరిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు సారథ్యం వహిస్తున్న పంత్... కీలక పోరులో బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 79 పరుగుల తేడాతో ఒడిశా చేతిలో ఓడింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఒడిశా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కెపె్టన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బిప్లబ్ సమంత్రాయ్ (72; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), హాఫ్ సెంచరీ సాధించగా... తక్కినవాళ్లంతా తలాకొన్ని పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో హృతిక్ షోకీన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ తడబడింది. 42.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. పంత్ (28 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రాణా (2), ప్రియాన్‡్ష ఆర్య (5), సార్థక్ రంజన్ (1) విఫలమవడంతో ఢిల్లీకి పరాజయం తప్పలేదు.
ఒడిశా బౌలర్లలో దేబబ్రత ప్రధాన్, సంబిత బరల్ చెరో 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడిన ఢిల్లీ 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో రైల్వేస్ 4 వికెట్ల తేడాతో గుజరాత్‌పై... హర్యానా 7 వికెట్ల తేడాతో సర్వీసెస్‌పై గెలుపొందాయి.
మయాంక్, దేవదత్ సెంచరీలు
టీమిండియా ప్లేయర్లు మయాంక్ అగర్వాల్ (124 బంతుల్లో 132; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు), దేవదత్ పడిక్కల్ (116 బంతుల్లో 113; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో కదంంతొక్కారు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక 67 పరుగుల తేడాతో పాండిచ్చేరిపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 363 పరుగులు చేసింది.
పడిక్కల్‌తో కలిసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మయాంక్ అగర్వాల్ తొలి వికెట్‌కు 228 పరుగులు జోడించగా... కరుణ్ నాయర్ (34 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభినవ్ మనోహర్ (21 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అనంతరం ఛేదనలో పాండిచ్చేరి 50 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది. నెయాన్ శ్యామ్ (68; 9 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... జయంత్ యాదవ్ (54), అజయ్ (32), కెప్టెన్ అమన్ ఖాన్ (34), మరిముత్తు (31), సిడాక్ సింగ్ (27) తలా కొన్ని పరుగులు చేశారు.
కర్ణాటక బౌలర్లలో మన్వంత్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా... కరుణ్ నాయర్, విద్వత్ కవెరప్పా చెరో 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన కర్ణాటక జట్టు 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో జార్ఖండ్ 9 వికెట్ల తేడాతో తమిళనాడుపై... కేరళ 2 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై... మధ్యప్రదేశ్ 4 వికెట్ల తేడాతో త్రిపురపై విజయాలు సాధించాయి.
నిప్పులు చెరిగిన ముకేశ్, ఆకాశ్, షమీ
భారత పేసర్లు మొహమ్మద్ షమీ (2/14), ముకేశ్ కుమార్ (4/16), ఆకాశ్‌దీప్ (4/32) సమష్టిగా సత్తా చాటారు. ఫలితంగా బెంగాల్ జట్టు విజయ్ హాజారే ట్రోఫీలో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ 9 వికెట్ల తేడాతో జమ్మూకశ్మీర్‌పై విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన జమ్మూకశ్మీర్ జట్టు 20.4 ఓవర్లలో 63 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ పారస్ డోగ్రా (19), శుభమ్ ఖజురియా (12) రెండంకెల స్కోరు చేయగా... మిగిలినవాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అంతర్జాతీయ స్థాయి బౌలర్ల ముందు జమ్మూ ప్లేయర్లు నిలవలేకపోయారు.
షమీ వికెట్ల వేట ప్రారంభించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముకేశ్, ఆకాశ్ దాన్ని కొనసాగించారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో బెంగాల్ 9.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 64 పరుగులు చేసి గెలిచింది. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన బెంగాల్ 12 పాయింట్లతో పట్టిక మూడో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఉత్తరప్రదేశ్ 58 పరుగుల తేడాతో అస్సాంపై... విదర్భ 8 వికెట్ల తేడాతో చండీగఢ్‌పై నెగ్గాయి.


