
ప్రస్తుత వన్డే క్రికెట్‌లో విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్‌గా మిగిలిపోయాడు. ఇతగాడు కేవలం 137 ఇన్నింగ్స్‌ల్లో 49.82 సగటుతో 18 సెంచరీలు, 29 అర్ద సెంచరీల సాయంతో 5879 పరుగులు చేశాడు. ప్రస్తుత తరంలో ఇంత గొప్ప గణాంకాలు చాలా తక్కువ మందికి ఉన్నాయి.
హాషిమ్ ఆమ్లా, విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్, ఏబీ డివిలియర్స్ మాత్రమే హోప్ కంటే మెరుగ్గా ఉన్నారు. తాజాగా హోప్ పాక్‌పై విధ్వంసకర శతకం (94 బంతుల్లో 120 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) బాది మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్శించాడు. స్వదేశంలో పాక్‌తో జరిగిన మూడో వన్డేలో ఇది జరిగింది.
హోప్ మెరుపు సెంచరీ.. పాక్‌ను చిత్తు చేసిన విండీస్
ఈ మ్యాచ్‌లో హోప్ మెరుపు సెంచరీ కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్‌ను జేడన్ సీల్స్ బెంబేలెత్తించాడు. 7.2 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పాక్ 29.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలి, 202 పరుగుల భారీ తేడాతో ఘెర పరాజయంపాలైంది.
34 ఏళ్ల తర్వాత
ఈ గెలుపుతో విండీస్ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. పాక్‌పై విండీస్‌కు 34 ఏళ్ల తర్వాత దక్కిన సిరీస్ విజయం ఇది. ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో పాక్, రెండో వన్డేలో విండీస్ గెలిచాయి.
83 బంతుల్లో శతకం
సిరీస్ డిసైడర్‌లో హోప్ చెలరేగి ఆడాడు. తొలుత నిదానంగా ఆడినా, ఆతర్వాత గేర్ మార్చి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 83 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న హోప్ ఆతర్వాత అస్సలు ఆగలేదు. హోప్ ధాటికి పాక్ బౌలర్లు చివరి 7 ఓవర్లలో ఏకంగా 100 పరుగులు సమర్పించుకున్నారు.
సిరీస్ ఆధ్యాంతం అదిరిపోయే ప్రదర్శనలు
ఈ సిరీస్ ఆధ్యాంతం హోప్ అదిరిపోయే ప్రదర్శనలు చేశాడు. తొలి వన్డేలో 55, రెండో వన్డేలో 32, తాజాగా జరిగిన వన్డేలో అజేయమైన 120 పరుగులు చేసి విండీస్ సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో హోప్ కెప్టెన్‌గానూ కీలకంగా వ్యవహరించాడు. బౌలర్లను మార్చడం, ఫీల్డింగ్‌ను సెట్ చేయడం, రివ్యూలు తీసుకోవడం లాంటి విషయాల్లో పరిణితి ప్రదర్శించాడు.
28 పరుగుల తేడాతో ఓడించిన హోప్
హోప్‌కు వన్డేల్లో ఇది 18వ సెంచరీ. ఈ సెంచరీ అతడికి చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. సిరీస్ డిసైడర్‌లో చేసినది కావడం, అందులోనూ జట్టు విజయానికి దోహదపడటం ఈ సెంచరీకి ఉన్న ప్రత్యేకత. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ మ్యాచ్‌లో హోప్ ఒక్కడే (తన 120 పరుగుల స్కోర్‌తో) పాక్‌ను 28 పరుగుల తేడాతో ఓడించాడు.
టాప్-3లోకి
ఈ సెంచరీతో హోప్ మరో ఘనత కూడా సాధించాడు. విండీస్ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డెస్మండ్ హేన్స్‌ను (17 సెంచరీలు) వెనక్కు నెట్టి టాప్-3లోకి (మూడో స్థానం) చేరాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (301 మ్యాచ్‌ల్లో 25 సెంచరీలు), బ్రియాన్ లారా (299 మ్యాచ్‌ల్లో 19 సెంచరీలు) టాప్-2గా ఉన్నారు.