
ఆసియాకప్-2025కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు చోటు దక్కలేదు. గతంలో కెప్టెన్లగా వ్యవహరించిన ఈ ఇద్దరి సీనియర్ ఆటగాళ్లు ఇప్పుడు ఏకంగా జట్టులోనే చోటు కోల్పోయారు.
పేలవ ఫామ్ కారణంగా వారిద్దరిని సెలక్టర్లు పక్కన పెట్టారు. ఇటీవల కాలంలో బాబర్, రిజ్వాన్‌లు పాల్గోని మల్టీ నేషన్ టోర్నమెంట్ ఆసియాకప్ కానుంది. ఫామ్‌తో సంబంధం లేకుండా ఐసీసీ ఈవెంట్లు, ఆసియాకప్ టోర్నీల్లో ఆడేందుకు వారిద్దరికి పీసీబీ సెలక్టర్లు అవకాశమిచ్చేవారు.
కానీ ఈసారి మాత్రం వహాబ్ రియాజ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వేటు వేసింది. ఇక బాబర్, రిజ్వాన్‌లను సెలక్టర్లు పక్కన పెట్టడానికి గల కారణాలను పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ వెల్లడించాడు. టీ20 క్రికెట్‌లో 'సంప్రదాయ శైలి' బ్యాటింగ్‌కు స్వస్తి పలికేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని హాఫీజ్ అన్నాడు.
టీ20ల్లో 2022 ఏడాది నుంచి మహ్మద్ రిజ్వాన్ స్ట్రైక్ రేట్ 122.26, బాబర్ స్ట్రైక్ రేట్ 127.34లగా ఉంది. టెస్టు హోదా కలిగి ఉన్న జట్లలో అత్యల్ప స్ట్రైక్ రేట్ కలిగి ఉన్న ఓపెనర్లు వీరిద్దరే.
"బాబర్ ఆజం, రిజ్వాన్‌లను కీలక ఆటగాళ్లు అని పిలవడం ముందు ఆపేయండి. ఇది చాలా తప్పు. వారిద్దరూ ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్‌లో ముఖ్యమైన ఆటగాళ్లు కాదు. పాకిస్తాన్‌కు విజయాలు అందించే వాళ్లు కీలక ప్లేయర్లు అవుతారు. సెలక్టర్లు సరైన నిర్ణయం తీసుకున్నారు.
గత రెండు సంవత్సరాలుగా సల్మాన్ అలీ అఘా, సైమ్ అయూబ్, హసన్ నవాజ్ వంటి ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో మ్యాచ్ విన్నర్లగా ఉన్నది వారే. కానీ వారి గురించి మనం మాట్లాడుకోవడం లేదు" అని ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదేవిధంగా స్టార్ పేసర్లు షాహీన్ షా అఫ్రిది, నసీం షా గురించి హాఫీజ్ మాట్లాడాడు.
షాహీన్ షా అఫ్రిది, నసీం షా ఇద్దరూ మైదానంలో పూర్తిగా నిబద్ధతతో ఉండాలి. అలా లేకపోతే సానుకూల ఫలితాలు సాధించలేరు. వారిద్దరూ గత కొంత కాలంగా పాకిస్తాన్‌కు విన్నింగ్ ప్రదర్శనలను అందించలేకపోతున్నారు. కాగా ఆసియాకప్ జట్టులో షాహీన్ అఫ్రిదికి చోటు దక్కగా నసీం షాకు సెలక్టర్లు మొండి చేయి చూపించారు.
ఆసియా కప్-2025 కోసం పాక్ జట్టు..
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్