
రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్ ఫ్రాంచైజీ మారే అంశం ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నడుస్తుంది. సంజూకు రాయల్స్‌లో కొనసాగే ఉద్దేశం లేదని ప్రచారం జరుగుతున్న వేల.. ఐపీఎల్ ట్రేడింగ్ విండో తెరుచుకుంది. ట్రేడింగ్ ద్వారా సంజూను దక్కించుకునేందుకు సీఎస్‌కే, కేకేఆర్ పోటీపడుతున్నట్లు సమాచారం.
అయితే సంజూ విషయంలో రాయల్స్ డిమాండ్లకు ఆ ఫ్రాంచైజీలు ససేమిరా అంటున్నట్లు తెలుస్తుంది. క్యాష్ డీల్ వరకు ఓకే కానీ, తమ ఆటగాళ్లను వదులుకునే ప్రసక్తే లేదని సదరు ఫ్రాంచైజీలు చెప్పినట్లు సమాచారం.
సంజూను సీఎస్‌కే కోరుకున్నట్లైతే ప్రతిగా నగదుతో పాటు ఇద్దరు ఆటగాళ్లను రాయల్స్ డిమాండ్ చేసిందట. రవీంద్ర జడేజా, శివమ్ దూబేలను తమకు ఇవ్వాలని రాయల్స్ కోరినట్లు సమాచారం. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ ఫ్రాంచైజీ సంజూను ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే బదులుగా అంగ్‌క్రిష్ రఘువంశీ, రమన్‌దీప్ సింగ్‌లను ఇవ్వాలని రాయల్స్ డిమాండ్ చేసిందట.
సంజూ ట్రేడింగ్ విషయంలో రాయల్స్ డిమాండ్లను ఇరు ఫ్రాంచైజీలు తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో రాయల్స్ సంజూను వేలానికి వదిలేస్తుందని మరో ప్రచారం మొదలైంది. ఇదే జరిగితే సంజూ కోసం సీఎస్‌కే, కేకేఆర్‌తో పాటు మరిన్ని ఫ్రాంచైజీలు పోటీపడవచ్చు.
ఇది ఓ రకంగా సంజూకు లాభదాయకమే అని చెప్పాలి. ప్రస్తుతమున్న ధరతో (రూ. 18 కోట్లు) పోలిస్తే అతనికి మరింత ధర లభించే అవకాశముంటుంది. అయితే సంజూ లాంటి ఆటగాడిని వేలం వరకు పోనివ్వకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎస్‌కే, కేకేఆర్ లాంటి ఫ్రాంచైజీలకు సంజూ లాంటి ఆటగాడి అవసరం చాలా ఉందని, ఈ ఫ్రాంచైజీలు రాయల్స్‌తో సయోధ్యకు రావచ్చని అంచనా వేస్తున్నారు.
ట్రేడింగ్ ద్వారా సంజూ ఎపిసోడ్‌కు పుల్‌స్టాప్ పడితే ఓకే కానీ, వేలం వరకు వెళ్లాల్సి వస్తే మాత్రం ఏమైనా జరగవచ్చు. సంజూకు పంత్‌కు మించిన ధర కంటే ఎక్కువ లభించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగని అంత మొత్తం లభిస్తుందని కూడా చెప్పలేని పరిస్థితి. పర్సుల విషయంలో ఫ్రాంచైజీలకు పరిమితులు ఉన్నాయి.
కాగా, జోస్ బట్లర్ విషయంలో సంజూ శాంసన్‌కు, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యానికి గ్యాప్ ఏర్పడినట్లు తెలుస్తుంది. తాను వద్దని చెప్పినా రాయల్స్ బట్లర్‌ను వేలానికి వదిలేసిందని సంజూ అలకపూనాడని ప్రచారం జరుగుతుంది. అంతే కాక జట్టులో తన ప్రాధాన్యత కూడా తగ్గిందని సంజూ భావిస్తున్నట్లు సమాచారం. ధృవ్ జురెల్ (వికెట్‌కీపింగ్), వైభవ్ సూర్యవంశీ (ఓపెనర్) రూపంలో తన స్థానానికి ప్రమాదం పొంచి ఉందని సంజూ భావిస్తుండవచ్చు.
ఇలాంటి ఎన్ని ప్రచారాలు సాగినా సంజూ ఐపీఎల్ భవితవ్యంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.