
అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ 2025-26 (Ranji Trophy 2025-26) సీజన్ కోసం 15 మంది సభ్యుల హైదరాబాద్ జట్టును (Hyderabad Ranji Team) నిన్న (అక్టోబర్ 8) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టీమిండియా యువ కెరటం తిలక్ వర్మ (Tilak Varma) ఎంపిక కాగా.. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) రాహుల్ సింగ్ నియమితుడయ్యాడు.
సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్, అభిరత్ రెడ్డి, హిమ తేజ, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, నిశాంత్, అనికేత్ రెడ్డి, కార్తికేయ, అలీ కాచి డైమండ్, రాహుల్ రాదేశ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. నితేష్ రెడ్డి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, రక్షన్ రెడ్డి, నితేష్ కనాలా, మిఖిల్ జైస్వాల్ స్టాండ్‌బైలుగా ఎన్నికయ్యారు.
ఈ రంజీ సీజన్‌కు టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహ్మద్ సిరాజ్ దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన, ఆతర్వాత సౌతాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్‌ల నేపథ్యంలో సిరాజ్‌కు దేశవాళీ క్రికెట్ నుంచి విశ్రాంతి కల్పించారు.
త్వరలో ఆస్ట్రేలియాలో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ ఎంపికైన విషయం తెలిసిందే. దీంతో అతను రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఆడబోయే తొలి మ్యాచ్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాడు.
ఈ సీజన్‌లో హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 15-18 మధ్యలో ఢిల్లీతో ఆడుతుంది. అనంతరం రెండో మ్యాచ్ (పుదుచ్చేరి) అక్టోబర్ 25 నుంచి ప్రారంభమవుతుంది. తిలక్ తొలి మ్యాచ్ ముగిసిన వెంటనే టీమిండియాతో పాటు ఆస్ట్రేలియాకు బయల్దేరతాడు.
ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన అక్టోబర్ 19 నుంచి మొదలవుతుంది. ఇందులో తొలుత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. తిలక్ వన్డే జట్టుకు ఎంపిక కాలేదు. వన్డే సిరీస్ అక్టోబర్ 19, 23, 25 తేదీల్లో జరుగుతుంది. అనంతరం అక్టోబర్ 29, 31, నవంబర్ 2, 6, 8 తేదీల్లో ఐదు టీ20 జరుగనున్నాయి.
ఇటీవలికాలంలో టీమిండియా తరఫున అదరగొడుతున్నతిలక్.. తాజాగా ముగిసిన ఆసియా కప్ ఫైనల్లో (పాకిస్తాన్‌పై) భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించిన విషయం తెలిసిందే.
గత సీజన్ ప్రదర్శన ఇలా ఉంది..!
గత సీజన్‌లో ఎలైట్ గ్రూప్-బిలో ఆడిన హైదరాబాద్ 7 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు మాత్రమే సాధించింది. రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకొని, మూడింట ఓడి, లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
రంజీ ట్రోఫీ 2025-26 కోసం హైదరాబాద్ జట్టు: తిలక్ వర్మ(కెప్టెన్), రాహుల్ సింగ్(వైస్ కెప్టెన్), సి.వి. మిలింద్, తన్మయ్ అగర్వాల్, ఎం. అభిరథ్ రెడ్డి, హిమతేజ, వరుణ్ గౌడ్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, శరణు నిశాంత్, పున్నయ్య, అనికేత్ రెడ్డి, కార్తికేయ కాక్, అలీ కాచి డైమండ్ (వికెట్ కీపర్), రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్)
స్టాండ్‌బై ఆటగాళ్లు: పి. నితీష్ రెడ్డి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, రక్షణ్ రెడ్డి, నితేష్ కనాలా, మిఖిల్ జైస్వాల్
చదవండి: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. తొలి బౌలర్