
తదుపరి ఐపీఎల్ సీజన్ (2026) ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నా, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి నుంచే మార్పులు చేర్పుల ప్రక్రియ మొదలుపెట్టింది. తొలుత కెప్టెన్ సంజూ శాంసన్ ఫ్రాంచైజీ వీడతాడని అనుకున్నా.. అతని కంటే ముందే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వైదొలిగాడు. తాజాగా రాయల్స్‌కు మరో కీలక వ్యక్తి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది.
ఆ ఫ్రాంచైజీ CEO జేక్ లష్ మెక్‌క్రమ్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. వచ్చే నెలలో అతను అధికారికంగా వైదొలగనున్నట్లు తెలుస్తుంది. జోహన్నెస్‌బర్గ్‌లో నిన్న (సెప్టెంబర్ 9) జరిగిన SA20 వేలంలో రాజస్థాన్ రాయల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన Paarl Royals టేబుల్ వద్ద జేక్ కనిపించలేదు. జేక్ 2021లో కేవలం 28 ఏళ్ల వయసులో రాయల్స్ CEOగా బాధ్యతలు చేపట్టి వార్తల్లో నిలిచాడు.

కాగా, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం గత సీజన్ పేలవ ప్రదర్శన అనంతరం ఫ్రాంచైజీలో సమూల ప్రక్షాళన చేపట్టాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే కీలక పదవుల్లో వారికి పొమ్మనలేక పొగ పెట్టింది. ఈ క్రమంలో తొలుత ఫ్రాంచైజీ మార్కెటింగ్ హెడ్, ఆతర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, తాజాగా సీఈఓ నిష్క్రమణ జరిగాయి.
త్వరలో కెప్టెన్ సంజూ శాంసన్ కూడా రాయల్స్‌కు గుడ్ బై చెప్పడం దాదాపుగా ఖరారైంది. రాయల్స్ యాజమాన్యం ఇంత మంది తప్పిస్తున్నా, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్న కుమార సంగక్కరను మాత్రం కొనసాగించనున్నట్లు తెలుస్తుంది. రాయల్స్ 2025 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.
గత సీజన్‌లో ఆ జట్టు తరఫున అద్బుతమైన ప్రదర్శనలు నమోదైనా ఎందుకో విజయాలు సాధించలేకపోయింది. చాలావరకు గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఒత్తిడిలోనై పరాజయాలపాలైంది. గత సీజన్‌లో రాయల్స్‌కు వైభవ్ సూర్యవంశీ రూపంలో ఆణిముత్యం దొరికాడు. వైభవ్ గత సీజన్‌లో ఎలా పేట్రేగిపోయాడో అందరం చూశాం.