సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో భారత జట్టుపై అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే.. అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. టీమిండియాతో తాజా టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ సందర్భంగా డికాక్ ఈ ఫీట్ నమోదు చేశాడు.
ముల్లన్‌పూర్ వేదికగా
రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెస్టుల్లో సఫారీలు 2-0తో వైట్‌వాష్ చేయగా.. వన్డేల్లో టీమిండియా 2-1తో గెలిచింది. అనంతరం కటక్‌లో జరిగిన తొలి టీ20లో భారత్ గెలవగా.. తాజాగా గురువారం నాటి రెండో టీ20కి ముల్లన్‌పూర్ ఆతిథ్యమిస్తోంది.
పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ స్టేడియంలో ఇదే తొలి మ్యాచ్ కాగా.. టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే, ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (8) వేగంగా ఆడే ప్రయత్నంలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
క్వింటన్ డికాక్ జోరు
ఫలితంగా సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోగా.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ మాత్రం జోరు కొనసాగించాడు. సఫారీ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మూడో బంతికి ఫోర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్లు ముందుకుసాగాడు.
12 ఇన్నింగ్స్‌లోనే
ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20లలో టీమిండియాపై అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. డికాక్ కంటే ముందు వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ఈ ఘనత సాధించారు. అయితే, ఇందుకు పూరన్‌కు 20 ఇన్నింగ్స్.. బట్లర్‌కు 24 ఇన్నింగ్స్ అవసరం కాగా.. డికాక్ 12 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ అందుకున్నాడు.
తొందరపాటు చర్యతో
కానీ 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనవసరపు పరుగుకు యత్నించి డికాక్ రనౌట్ అయ్యాడు. పదహారో ఓవర్ తొలి బంతికి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో షాట్ బాదేందుకు ప్రయత్నించి అతడు విఫలం కాగా.. బంతిని అందుకున్న కీపర్ జితేశ్ శర్మ స్టంప్స్‌కు గిరాటేశాడు.
దీంతో డికాక్ రనౌట్ అయ్యాడు. కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్ రీఎంట్రీలో డికాక్ చేసిన స్కోర్లు వరుసగా.. 1, 23, 7, 0, 0, 90 (46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు). వరుస వైఫల్యాల తర్వాత ఫామ్‌లోకి వచ్చిన డికాక్.. ఇలా తొందరపాటు చర్యతో భారీ మూల్యమే చెల్లించాడు. సెంచరీకి పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు.


