
ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో సంజూ శాంసన్ ట్రేడ్ డీల్‌కు సంబంధించిన చర్చలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. అసలు కారణాలు తెలియరానప్పటికీ సంజూ రాజస్థాన్ రాయల్స్‌ను వీడాలనుకుంటున్న విషయం స్పష్టమైపోయింది. రాయల్స్ సైతం సంజూ అభిమతాన్ని గౌరవమిస్తూ, అతన్ని వదిలేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సీఎస్‌కేతో ట్రేడ్ డీల్ గురించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
సంజూకు బదులుగా రాయల్స్ సీఎస్‌కే నుంచి ఇద్దరిని ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే సీఎస్‌కే యాజమాన్యం ఇందుకు సమ్మతిస్తున్నట్లు లేదు. సంజూను తాము తీసుకుంటే కేవలం క్యాష్ డీల్ మాత్రమే ఉంటుందని, తమ ఆటగాళ్లను ఎవరినీ వదిలిపెట్టుకునే ప్రసక్తే లేదని సీఎస్‌కే స్పష్టం చేసినట్లు సమాచారం.
ఈ ప్రచారాల నడుమ సంజూ రాయల్స్‌ను వీడాలనుకోవడానికి కారణమిదే అంటూ ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. సంజూ రాయల్స్‌ను వద్దనుకోవడానికి జోస్ బట్లర్ ప్రధాన కారణమన్నది ఆ వార్త సారాంశం. రాయల్స్ యాజమాన్యం 2025 మెగా వేలానికి ముందు బట్లర్‌ను రీటైన్ చేసుకోలేదు.
ఇది సంజూకు అస్సలు మింగుడు పడలేదంట. జోస్ 2018-2024 వరకు రాయల్స్ విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించినప్పటికీ అతన్ని రీటైన్ చేసుకోకపోవడం సంజూకు అస్సలు నచ్చలేదట. ఈ కారణంగానే అతను మేనేజ్‌మెంట్‌తో విభేదించినట్లు సమాచారం.
సంజూ రాయల్స్‌ను వద్దనుకోవడానికి మరిన్ని కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో మొదటిది.. గత సీజన్‌లో అతని గైర్హాజరీలో (గాయం కారణంగా) వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా పాతుకుపోవడం. రెండవది.. యాజమాన్యం అతని ప్రత్యామ్నాయంగా ధృవ్ జురెల్‌కు ప్రాధాన్యత ఇవ్వడం. ఈ కారణాల వల్ల సంజూకు రాయల్స్ యాజమాన్యానికి గ్యాప్ పెరిగిందని తెలుస్తుంది.
తన మాట చెల్లని చోట, తన స్థానం యాజమాన్యానికి భారమైన చోట ఉండటం ఇష్టం లేకనే సంజూ రాయల్స్‌ను వీడాలని అనుకున్నాడని పలు నివేదికలు చెబుతున్నాయి. 2013లో రాయల్స్‌లో జాయిన్ అయిన సంజూ.. 2021 సీజన్ నంచి ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సంజూ నేతృత్వంలో రాయల్స్ 2022 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. సంజూ, జోస్ బట్లర్ కలిసి రాయల్స్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు.
ఇంత చేసినా తన మాట చెల్లకుండా బట్లర్‌ను వదిలేయడం సంజూను చాలా బాధించినట్లు తెలుస్తుంది. బట్లర్‌ను కాదని రాయల్స్ యాజమాన్యం తనతో సహా యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, జురెల్, హెట్‌మైర్, సందీప్ శర్మను అట్టిపెట్టుకుంది. రాయల్స్ వద్దనుకున్నా బట్లర్‌ను గుజరాత్ టైటాన్స్ వేలంలో రూ. 15.75 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది.