
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందే ట్రేడింగ్ రూపంలో జట్లలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సంజూ శాంసన్ (Sanju Samson). రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా రాణించిన ఈ కేరళ బ్యాటర్.. వచ్చే ఎడిషన్‌లో ఈ ఫ్రాంఛైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాను ఫిట్‌గా ఉన్నా రియాన్ పరాగ్ (Riyan Parag)కు కెప్టెన్సీ ఇవ్వడం, మెగా వేలంలో జోస్ బట్లర్‌ను విడిచిపెట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో సంజూ.. రాయల్స్‌ను వీడేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సీఎస్‌కేకు అశ్విన్ గుడ్‌బై?
ఈ క్రమంలో తెరమీదకు వచ్చిన మరో ఆసక్తికర వార్త ఇందుకు బలం చేకూరుస్తోంది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin).. తనను విడిచిపెట్టమని సీఎస్‌కేను కోరాడని దాని సారాంశం. దీనిని బట్టి సీఎస్‌కే అశూను రాయల్స్‌కు ఇచ్చి.. వారి నుంచి సంజూను ట్రేడ్ చేసుకోనుందనే ప్రచారం ఊపందుకుంది.
కాగా 2009లో అశ్విన్ సీఎస్‌కేతోనే తన ఐపీఎల్ కెరీర్ ఆరంభించాడు. ఆ తర్వాత రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ (ఇప్పుడు మనుగడలో లేదు), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. ఇక 2022లో రాజస్తాన్ రాయల్స్‌లో చేరిన అశ్విన్.. గతేడాది వరకు అక్కడే విజయవంతంగా కొనసాగాడు.
రూ. 9.75 కోట్లకు కొనుగోలు
అయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రాయల్స్ అతడిని విడుదల చేయగా.. సీఎస్‌కే రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ.. ఈ సీజన్‌లో అశ్విన్‌కు తొమ్మిది మ్యాచ్‌లలో ఆడే అవకాశం మాత్రమే దక్కింది. అయితే, అందులోనూ అతడు నిలకడగా రాణించలేకపోయాడు. కేవలం ఏడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.
వేరే జట్టుకు మారతాడా?
యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇచ్చే క్రమంలో మేనేజ్‌మెంట్ అశూను పలు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో 38 ఏళ్ల ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ సీఎస్‌కేను వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అయితే, రాయల్స్ అతడిని తిరిగి తీసుకుంటుందా? లేదంటే వేరే జట్టుకు మారతాడా? అనేది త్వరలోనే తెలుస్తుంది. కాగా ఐపీఎల్‌లో అశ్విన్ మొత్తంగా 220 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు కూల్చాడు.
ఇక గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడే అశూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీమిండియా తరఫున 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ చెన్నై ప్లేయర్.. టెస్టుల్లో 537, వన్డేల్లో 156, టీ20లలో 72 వికెట్లు కూల్చాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 3503, 707, 184 పరుగులు సాధించాడు.
చదవండి: అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయర్.. ఆసియాకప్‌లో ఆడాల్సిందే: గంగూలీ