
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టంతా ఆసియాకప్-2025పై పడింది. ఆసియాకప్‌నకు భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది? ఐపీఎల్‌లో రాణించిన ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేస్తారా? అన్న చర్చలు క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్నాయి.
ఈ మెగా టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆగస్టు మూడో వారంలో ప్రకటించే అవకాశముంది. ఈ క్రమంలో భారత సెలక్టర్లకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక సూచన చేశాడు.
ముఖేష్‌కు ఛాన్స్ ఇవ్వాల్సిందే?
బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్‌ను ఆసియాకప్‌నకు ఎంపిక చేయాలని దాదా సలహాఇచ్చాడు. కాగా ముఖేష్ కుమార్ రెండు సంవత్సరాల కిందట భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఈ కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ దాదాపు ఏడాది పాటు మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.
ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో జట్టుకు ముఖేష్ దూరమయ్యాడు. అతడు చివరగా భారత్ తరపున గతేడాది జూలైలో ఆడాడు. ఆ తర్వాత ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ ముఖేష్ ఆకట్టుకోలేకపోయాడు. కానీ అతడి వద్ద అద్బుతమైన స్కిల్స్ ఉన్నాయని, అతడికి మరో ఛాన్స్ ఇవ్వాల్సిందేనని గంగూలీ మాత్రం సపోర్ట్‌గా నిలిచాడు.
"ఆసియాకప్‌లో ముఖేష్ కుమార్ ఖచ్చితంగా ఆడాలి. అతడు అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. యూఏఈ కండీషన్స్ అతడికి సరిగ్గా సరిపోతాయి. దేశవాళీ క్రికెట్‌లో కూడా నిలకడగా రాణిస్తున్నాడు. అతడు జట్టులోకి పునరాగమనం చేసేందుకు ఆర్హుడు. ముఖేష్‌కు అన్ని ఫార్మాట్లలోనూ రాణించే సత్తా ఉంది. అతడికంటూ ఒక సమయం వస్తుంది. అందుకు కాస్త ఓపిక పట్టాలి" అని ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ పేర్కొన్నాడు.
కాగా ముఖేష్ ఇప్పటివరకు భారత తరపున 17 టీ20లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో అతడి పేరిట 36 వికెట్లు ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్ తిరిగి టీ20 జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ సైతం తన ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు. టోర్నీ ఆరంభ సమయానికి సూర్య పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశముంది
చదవండి: Asia Cup: అతడు భేష్.. ఇతడు ఓకే.. టీమిండియా సెలక్టర్లకు తలనొప్పి!