
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న టీమిండియా తదుపరి మెగా టోర్నమెంట్లో పాల్గొననుంది. సుదీర్ఘ విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆసియా కప్-2025 (Asia Cup 2025)కు భారత ఆటగాళ్లు సన్నద్ధం కానున్నారు. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌కు ఆతిథ్య జట్టు భారత్ అయినా.. తటస్థ వేదిక యూఏఈలో మ్యాచ్‌లు జరుగనున్నాయి.
సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆగష్టు ఆఖరి వారంలో తమ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఎంపికపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
కెప్టెన్‌గా అతడు?!
కాగా భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఈ మెగా టోర్నీ ఆడతాడా లేదా అన్న అంశంపై సందిగ్దం నెలకొంది. స్పోర్ట్స్ హెర్నియాకు సర్జరీ చేయించుకున్న సూర్య.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే, ఆసియా కప్ నాటికి అతడు పూర్తి స్థాయిలో మ్యాచ్ ఫిట్‌నెస్ సాధిస్తాడా? లేదా అన్నది తేలాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ టీమిండియా పగ్గాలు చేపట్టే అవకాశం కనిపిస్తున్నా.. శుబ్‌మన్ గిల్ రాకతో ఇది సాధ్యం కాదనిపిస్తోంది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా ఇంగ్లండ్ గడ్డ మీద ఇరగదీసిన గిల్.. అంతకు ముందు ఐపీఎల్-2025లోనూ గుజరాత్ టైటాన్స్ సారథిగా సత్తా చాటాడు.
ఈ క్రమంలో ఐపీఎల్, ఇంగ్లండ్‌లో ప్రదర్శన ఆధారంగా గిల్ టీ20 జట్టులోకి తిరిగి వస్తే.. అతడే కెప్టెన్ అవుతాడని చెప్పవచ్చు. మరోవైపు.. టైటాన్స్ జట్టులో గిల్ సహచర ఓపెనర్, అత్యధిక పరుగుల వీరుడు (759) సాయి సుదర్శన్ కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
అభిషేక్ ఓకే.. సంజూ పరిస్థితి ఏంటి?
ఒకవేళ వీరిద్దరు ఓపెనర్లుగా ఖరారైతే.. ఇన్నాళ్లుగా టీమిండియా టీ20 విజయాల్లో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్, అభిషేక్ శర్మల పరిస్థితి సంకటంలో పడుతుంది. మరోవైపు.. యశస్వి జైస్వాల్ నుంచి కూడా వీరికి ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో అభిషేక్ కాస్త సేఫ్‌గానే ఉన్నా.. ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమైన సంజూకు మాత్రం చోటు దక్కడం కష్టమే అనిపిస్తోంది.
ప్లస్‌లూ.. మైనస్‌లూ
అయితే, వికెట్ కీపర్‌గా సంజూకు ఉన్న అదనపు అర్హత అతడికి కాస్త ఊరట కలిగించే అంశం. ఏదేమైనా జైసూ వైపు సెలక్టర్లు మొగ్గుచూపితే మాత్రం సంజూకు కష్టాలు తప్పవు. టీ20 ప్రపంచకప్-2026 నాటికి జట్టును సన్నద్ధం చేయాలని భావిస్తే జైసూకే సెలక్టర్లు ఓటు వేయొచ్చు.
కానీ.. గత రెండేళ్ల కాలంలో టీమిండియా తరఫున మూడు సెంచరీలు, ఒక అర్ధ శతకం బాదిన సంజూకు తుదిజట్టులో చోటివ్వకుంటే మాత్రం విమర్శలు తప్పవు. అయితే, 21 ఇన్నింగ్స్‌లో అతడు ఐదుసార్లు డకౌట్ కావడం, ఐదుసార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడం కూడా గమనించాల్సిన విషయం.
ఇక వికెట్ కీపర్‌గానూ జితేశ్ శర్మ, ధ్రువ్ జురెల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌ల రూపంలో సంజూకు పోటీ ఎక్కువగానే ఉంది. పంత్ గాయపడ్డాడు కాబట్టి అతడిని పక్కనపెట్టినా మిగతా వాళ్లు మాత్రం కచ్చితంగా రేసులో ఉంటారు.
శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ?
ఈ టోర్నీలో సంజూతో పాటు సెలక్టర్లకు తలనొప్పి తెప్పించే మరో ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే.. అది.. శ్రేయస్ అయ్యర్. టెస్టులు, టీ20ల నుంచి టీమిండియా సెలక్టర్లు అతడిని పక్కనపెట్టినా దేశీ క్రికెట్, ఐపీఎల్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ దుమ్ములేపుతున్నాడు.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(వన్డే)ని టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్-2025లోనూ అదరగొట్టాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంపికైన ఈ కాస్ట్‌లీ ప్లేయర్ (రూ. 26.75 కోట్లు) ఇటు సారథిగా.. అటు బ్యాటర్‌గా ఆకట్టుకున్నాడు.
17 మ్యాచ్‌లలో కలిపి 604 పరుగులు సాధించిన శ్రేయస్ అయ్యర్.. పంజాబ్‌ను ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. అయితే, ఆరు పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడటంతో ఈసారి ట్రోఫీని మిస్సయ్యాడు. కాగా గతేడాది అతడు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా టైటిల్ అందించిన విషయం తెలిసిందే.
గత 12నెలల కాలంలో 25 ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ 949 పరుగులు సాధించడం.. అతడి నిలకడైన ఆటకు నిదర్శనం. మరి ఈసారైనా శ్రేయస్‌కు టీ20 జట్టు తలుపులు తెరవకపోతే సెలక్టర్లపై విమర్శలు రావడం సహజం.
చదవండి: బీసీసీఐ వేటు!.. నా ఫ్యామిలీ లాంటిది అంటూ భావోద్వేగం