
టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టగానే గౌతం గంభీర్ Gautam Gambhir).. సహాయ సిబ్బంది నియామకం విషయంలోనూ తన మాట నెగ్గించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో వేర్వేరు సమయాల్లో, వేర్వేరు జట్లలో తనతో కలిసి పనిచేసిన ముగ్గురిని కోచింగ్ సిబ్బందిలో చేర్చుకున్నాడు.
లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా ఉన్నప్పుడు తనతో కలిసి సహాయక సిబ్బందిలో ఉన్న దక్షిణాఫ్రికా బౌలర్ మోర్నీ మోర్కెల్‌ను.. టీమిండియా బౌలింగ్ కోచ్‌గా తెచ్చుకున్నాడు. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో ఉన్నపుడు తన అసిస్టెంట్లుగా ఉన్న నెదర్లాండ్స్ మాజీ ఆటగాడు ర్యాన్ డష్కాటే, భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్‌ను టీమిండియాలోనూ అసిస్టెంట్ కోచ్‌లుగా తెచ్చుకున్నాడు.
వేటు వేసిన బీసీసీఐ
అయితే, టీమిండియా టెస్టుల్లో వరుసగా విఫలమైన తరుణంలో అభిషేక్ నాయర్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వేటు వేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని భారత్ చేజార్చుకున్న తర్వాత.. అతడికి ఉద్వాసన పలికింది.
ఈ క్రమంలో అభిషేక్ నాయర్ మళ్లీ తన సొంతగూటికి చేరుకున్నాడు. ఐపీఎల్-2025లో కోల్‌కతా జట్టు అసిస్టెంట్ కోచ్‌గా సేవలు అందించాడు. ఇటు బీసీసీఐ పొమ్మనగానే.. అటు కేకేఆర్ తనను అక్కున చేర్చుకోవడంపై అభిషేక్ నాయర్ తాజాగా స్పందించాడు.
నాకు కేకేఆర్ ఫ్యామిలీ లాంటిది
‘‘కేకేఆర్ నా సొంత కుటుంబం వంటిది. ప్రతి వ్యక్తి తన భావోద్వేగాలను ఫ్యామిలీతోనే పంచుకుంటాడు. నాకు కేకేఆర్ ఫ్యామిలీ. కాబట్టే ఎలా ఇక్కడి నుంచి వెళ్లానో.. అంతే వేగంగా తిరిగి వచ్చేశాను. అన్ని రకాలుగా నేను కేకేఆర్‌కే చెందినవాడిని.
ఇది నా ఇల్లు. ఇక్కడే నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఈసారి కూడా అలాగే జరిగింది’’ అని అభిషేక్ నాయర్ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఈ ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో యూపీ వారియర్స్‌కు అభిషేక్ నాయర్ మార్గదర్శనం చేయనున్నాడు. ఆ జట్టు హెడ్‌కోచ్‌గా అతడు నియమితుడైనట్లు ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది.
ఆ జట్టుకు హెడ్‌కోచ్‌గా..
ఈ విషయం గురించి అభిషేక్ నాయర్ మాట్లాడుతూ.. ‘‘డబ్ల్యూపీఎల్ కేవలం భారత క్రికెట్ మీద మాత్రమే కాకుండా.. దేశవాళీ క్రికెట్ మీద కూడా ఉంది. తొలి సీజన్ నుంచి ఇప్పటికి చాలా మారింది. ఆదరణ పెరిగింది.
అమ్మాయిలు డైవ్ చేస్తున్నారు. మైదానంలో పాదరసంలా కదులుతూ బంతిని ఫాస్ట్‌గా త్రో చేస్తున్నారు. రోజురోజుకీ ఈ లీగ్ అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన టీమిండియా.. ఆ తర్వాత ఆసీస్‌తో సిరీస్‌లోనూ 3-1తో ఓడిపోయింది. అయితే, తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో మాత్రం అదరగొట్టింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో సమం చేసింది. తద్వారా వరుస పరాజయాల తర్వాత కోచ్ గౌతం గంభీర్‌కు ఉపశమనం కలిగింది.
చదవండి: Dhruv Jurel: అతడికి నువ్వెందుకు చెప్పలేదు? గిల్‌తో సిరాజ్.. కొంప మునిగేదే!