అతడికి నువ్వెందుకు చెప్పవు? గిల్‌తో సిరాజ్‌.. కొంప మునిగేదే! | Tune Bola Kyu Nahi: Gill Reacts On Field Argument With Siraj at Oval Day 5 | Sakshi
Sakshi News home page

Dhruv Jurel: అతడికి నువ్వెందుకు చెప్పలేదు? గిల్‌తో సిరాజ్‌.. కొంప మునిగేదే!

Aug 6 2025 11:49 AM | Updated on Aug 6 2025 12:35 PM

Tune Bola Kyu Nahi: Gill Reacts On Field Argument With Siraj at Oval Day 5

ఐదో టెస్టు ఆఖరి రోజు వరకు ఉత్కంఠ రేపిన పోరులో భారత్‌ ఇంగ్లండ్‌పై గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ఓటమి అంచుల వరకు వెళ్లినా.. అనూహ్య రీతిలో పుంజుకుని సంచలన విజయం సాధించింది. ఓవల్‌లో చివరిదైన ఐదో రోజు ఆటలో ఇంగ్లండ్‌ గెలుపునకు 35 పరుగుల దూరంలో ఉండగా.. భారత్‌కు నాలుగు వికెట్లు అవసరమయ్యాయి.

అద్భుతం చేసిన సిరాజ్‌ 
ఇలాంటి క్లిష్ట సమీకరణాల వేళ టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) అద్భుతమైన బౌలింగ్‌తో.. ఆఖరి రోజు నాలుగింటిలో మూడు వికెట్లు తానే పడగొట్టాడు. ముఖ్యంగా ఆఖరి వికెట్‌గా గస్‌ అట్కిన్సన్‌ను వెనక్కి పంపి భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చడం సిరీస్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.

జురెల్‌ ఏమరపాటు కారణంగా
నిజానికి ఇంగ్లండ్‌ ఇంకాస్త ముందే ఈ వికెట్‌ కోల్పోయి ఉండేది. అయితే, వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ (Dhruv Jurel) కాస్త ఏమరపాటుగా ఉండటంతో ప్రత్యర్థి జట్టుకు పరుగు లభించింది. దీంతో మరోసారి నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ సిరాజ్‌ సరైన సమయంలో అట్కిన్సన్‌ను అవుట్‌ చేయకపోయి ఉంటే.. జురెల్‌ చేసిన పొరపాటు కారణంగా టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది.

అసలేం జరిగిందంటే.. ఓవల్‌ టెస్టు ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోగానే.. ఆ జట్టు ఆటగాడు క్రిస్‌ వోక్స్‌ భుజం విరిగినప్పటికీ బ్యాటర్‌గా వచ్చాడు. అయితే, స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న అట్కిన్సన్‌.. వోక్స్‌ బ్యాటింగ్‌ చేసే పరిస్థితి లేదు కాబట్టి.. ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్‌ తీసి.. మళ్లీ తానే క్రీజులోకి వచ్చేలా చూసుకున్నాడు.

సిరాజ్‌ ప్లాన్‌ ఇదే
ఈ నేపథ్యంలో భారత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)- సిరాజ్‌ కలిసి ఈ జోడీని రనౌట్‌ చేయాలి లేదంటే.. అద్భుతమైన డెలివరీతో అట్కిన్సన్‌ను వెనక్కి పంపాలని ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగానే 84వ ఓవర్లో వైడ్‌ లేదా యార్కర్‌ వేయాలని సిరాజ్‌- గిల్‌ ప్లాన్‌ చేశారు.

అనుకున్నట్లుగానే అట్కిన్సన్‌ సిరాజ్‌ వేసిన బంతిని మిస్సయ్యాడు. అయినా సింగిల్‌కు వెళ్లాడు. అయితే, వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ సరైన సమయంలో బంతిని అందుకుని స్టంప్స్‌ వైపు గిరాటెయ్యలేకపోయాడు. ఫలితంగా ఆ ఓవర్లో ఆఖరి బంతికి సింగిల్‌ తీసి అట్కిన్సన్‌ మరోసారి క్రీజులోకి వచ్చాడు. దీంతో సిరాజ్‌ వెళ్లి గిల్‌తో కాస్త గట్టిగానే ఏదో వాదించినట్లుగా కనిపించింది.

అయితే, ఆ మరుసటి ఓవర్లోనూ సింగిల్‌ తీయగలిగిన అట్కిన్సన్‌ (29 బంతుల్లో 17)ను.. 86వ ఓవర్‌ మొదటి బంతికే సిరాజ్‌ బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ కథ ముగిసింది. భారత్‌ ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగింది.

అతడికి ఎందుకు చెప్పవు?
ఈ పరిణామాలపై స్పందించిన కెప్టెన్‌ గిల్‌ మాట్లాడుతూ.. ‘‘సిరాజ్‌ నా దగ్గరికి వచ్చి.. రనౌట్‌ చేసేందుకు ధ్రువ్‌ జురెల్‌ను సిద్ధంగా ఉండమని చెప్పాడు. అయితే, నేను ధ్రువ్‌తో ఈ మాట చెప్పే కంటే ముందే సిరాజ్‌ బౌలింగ్‌ చేసేందుకు రన్‌ మొదలుపెట్టాడు.

దీంతో ధ్రువ్ వేగంగా స్పందించలేకపోయాడు. అతడు స్టంప్స్‌ను మిస్‌ చేయగానే సిరాజ్‌ నా దగ్గరికి వచ్చి.. ‘నువ్వు అతడికి ఎందుకు చెప్పవు?’’ అని నన్ను ప్రశ్నించాడు’’ అని గిల్‌ తెలిపాడు. 

కాగా ఇంగ్లండ్‌ పర్యటనలో ఐదు టెస్టులు ఆడిన టీమిండియా.. రెండు గెలిచి.. ఒకటి డ్రా చేసుకుంది. తద్వారా ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీని 2-2తో సమం చేసింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా గిల్‌కు ఇదే తొలి సిరీస్‌ అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్‌లో సిరాజ్‌ వెయ్యికి పైగా బంతులు వేసి 23 వికెట్లు కూల్చడం విశేషం.

చదవండి: ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు: గంభీర్‌ స్పీచ్‌ వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement