టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత రోహిత్ శర్మది. హిట్‌మ్యాన్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను భారత్ కైవసం చేసుకుంది.
అయితే, కోరుకున్నట్లుగానే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకొన్న రోహిత్ శర్మ.. అనూహ్య రీతిలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఊహించని విధంగా వన్డే కెప్టెన్సీ నుంచి మేనేజ్‌మెంట్ అతడిని తొలగించింది.
అగార్కర్ అలా
రోహిత్ శర్మ స్థానంలో శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు వన్డే పగ్గాలూ అప్పగించగా.. వరుసగా రెండు సిరీస్‌లలో టీమిండియా ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2027లో రోహిత్ ఆడే విషయంపై స్పష్టత లేనందనే అతడిని కెప్టెన్‌గా తప్పించామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు.
ఆస్ట్రేలియా గడ్డ మీద హిట్
ఈ క్రమంలో.. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద రోహిత్ శర్మ అదరగొట్టాడు. సెంచరీ చేసి మరీ తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. అనంతరం బీసీసీఐ ఆదేశాల మేరకు ముంబై తరఫున దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ బరిలో దిగి అక్కడా శతక్కొట్టాడు.
అయితే, తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మాత్రం రోహిత్ శర్మ స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు. మూడు వన్డేలలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ చేసిన స్కోర్లు వరుసగా.. 26, 24, 11. ఈ నేపథ్యంలో రోహిత్ ఆట తీరుపై విమర్శలు రాగా.. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే కూడా ఇందుకు మద్దతు ఇచ్చినట్లుగానే వ్యాఖ్యలు చేశాడు.
డష్కాటే కామెంట్స్
‘‘తొలి వన్డేలో రోహిత్ స్థాయికి తగినట్లు ఆడలేదు. ఆ తర్వాతి మ్యాచ్‌లూ అతడికి సవాలుగా మారాయి. ఈ సిరీస్‌కు ముందు పెద్దగా క్రికెట్ ఆడకపోవడం వల్లే ఇలా జరిగింది’’ అని డష్కాటే పేర్కొన్నాడు. నిజానికి ఆసీస్‌తో సిరీస్‌లో సత్తా చాటిన రోహిత్.. దేశీ క్రికెట్‌లోనూ ఆడాడు. అయినప్పటికీ డష్కాటే ఇలా వ్యాఖ్యానించాడు.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి డష్కాటే తీరును ఎండగట్టాడు. కోచ్ చేసే ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఆటగాళ్ల మానసిక స్థితి ప్రభావితం అవుతుందని.. అతడిని ఒత్తిడిలోకి నెట్టివేయాలనే ప్రయత్నం తగదని చురకలు అంటించాడు.
కోచ్‌కు ఇచ్చిపడేసిన మనోజ్ తివారి
టీమిండియా సహాయక సిబ్బందిలో భాగమై ఉండి ఇలా మాట్లాడటం సరికాదని మనోజ్ తివారి డష్కాటేను విమర్శించాడు. రోహిత్‌తో నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేయిస్తూనే.. మీడియా ముందుకు వచ్చి అందుకు విరుద్ధంగా మాట్లాడటం ఏమిటని మండిపడ్డాడు. రోహిత్ ఫామ్ గురించి అడిగినపుడు నోరు మూసుకుని ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మరోవైపు.. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మను వన్డే జట్టులోకి తీసుకుని.. వరల్డ్‌కప్-2027లోనూ ఆడిస్తే బాగుంటుందని ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. అతడి కంటే యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ముందు వరుసలో ఉన్నాడని పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో ప్రస్తుతం గిల్- రోహిత్ ఓపెనర్లుగా ఉన్నారు.
వరల్డ్‌కప్ ఆడకుండా కుట్ర!?
ఓవైపు అగార్కర్, డష్కాటే కామెంట్స్.. మరోవైపు ఇర్ఫాన్ పఠాన్ అంచనాలు.. వీటన్నింటిని చూసి రోహిత్ శర్మ అభిమానులు చిర్రెత్తిపోతున్నారు. హిట్‌మ్యాన్‌ను వన్డే వరల్డ్‌కప్-2027 ఆడకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
విరాట్ కోహ్లి విషయంలోనూ అగార్కర్ ఇలాగే మాట్లాడాడని.. అయితే, అతడు వరుస సెంచరీలు చేయడంతో ఇప్పట్లో అతడికి జోలికి వెళ్లరని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా డష్కాటేకు మనోజ్ తివారి చివాట్లు పెట్టిన తీరు బాగుందని.. దిగ్గజ ఆటగాడి పట్ల ఒక కోచ్ ఇలా వ్యవహరించడం సరికాదని పేర్కొంటున్నారు.


