
ఇంగ్లండ్ గడ్డ మీద ఆద్యంతం ఆసక్తిగా సాగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా ఆఖరిదైన ఐదో టెస్టులో అసాధారణ రీతిలో పుంజుకుని ఆతిథ్య జట్టుపై విజయభేరి మోగించింది. తద్వారా ఓడిపోవడం ఖాయమనుకున్న ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)ని 2-2తో సమం చేసింది.
దీంతో వరుస పరాజయాల తర్వాత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)కు కాస్త ఊరట లభించింది. టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు కూడా శుభారంభమే దక్కింది. అయితే, తుదిజట్టు విషయంలో కొన్ని అనూహ్య ఎంపికలు, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను సిరీస్ మొత్తానికి దూరంగా ఉంచడం వీరిద్దరిపై విమర్శలకు కారణమయ్యాయి.
దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత..
ఏదేమైనా స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్, కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత... అది కూడా విదేశీ గడ్డ మీద జరిగిన సిరీస్‌లో భారత్ ఈ మేర సఫలం కావడం హర్షించదగ్గ విషయమే. ఈ పరిణామాల నేపథ్యంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ డ్రెసింగ్‌రూమ్‌లో చేసిన ప్రసంగం వైరల్‌గా మారింది.
ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు
‘ఇక్కడ ఈ సిరీస్‌ను 2–2తో ముగియడం చాలా గొప్ప ఫలితం. అందరికీ నా అభినందనలు. అయితే మనం మెరుగుపడేందుకు ఇంకా అవకాశం ఉంటుంది. దాని కోసం మరింత కష్టపడుతూనే ఉండాలి. అలా చేస్తే సుదీర్ఘ కాలం టీమిండియా ప్రపంచ క్రికెట్‌ను శాసించగలదు.
ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. డ్రెస్సింగ్‌రూమ్‌లో సంస్కృతి ఎలా ఉండాలంటే అందరూ ఇందులో భాగం కావాలని కోరుకోవాలి. ఇదే మనం చేయాల్సిన పని’ అని గంభీర్ మార్గనిర్దేశనం చేశాడు. ఓవల్‌లో విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ ఈ మేరకు ఆటగాళ్లతో ప్రత్యేకంగా మాట్లాడాడు.
గొప్పగా అనిపించింది
ఈ సందర్భంగా ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అనే ప్రత్యేక అవార్డును రవీంద్ర జడేజా చేతుల మీదుగా వాషింగ్టన్ సుందర్ అందుకున్నాడు. ‘ఇంగ్లండ్‌లో వరుసగా నాలుగు టెస్టులు ఆడే అవకాశం రావడం నా అదృష్టం. ఇక్కడ బాగా ఆడాలని ఎంతో కోరుకున్నాను. ప్రతీ రోజు మన జట్టు ఆడిన తీరు చాలా గొప్పగా అనిపించింది’ అని సుందర్ వ్యాఖ్యానించాడు.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్-2025 ఫలితాలు
👉తొలి టెస్టు- హెడింగ్లీ, లీడ్స్- ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు
✊రెండో టెస్టు- ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్- 336 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం- ఈ వేదికపై భారత్‌కు ఇదే తొలి గెలుపు
👉మూడో టెస్టు- లార్డ్స్, లండన్- 22 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లండ్
🤝నాలుగో టెస్టు- ఓల్డ్ ట్రఫోర్డ్, మాంచెస్టర్- డ్రా
✊ఐదో టెస్టు- కెన్నింగ్‌టన్ ఓవల్, లండన్- ఆరు పరుగుల తేడాతో టీమిండియా గెలుపు
🤝సిరీస్ ఫలితం- 2-2తో సమం
చదవండి: Asia Cup 2025: ఆసియా కప్‌లో గిల్, జైస్వాల్!