తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్ జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సంజూ శాంసన్ ఆరంభంలోనే ఔటైనప్పటికి మిగితా బ్యాటర్లు మాత్రం కివీస్ బౌలర్లను ఉతికారేశారు.
వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. సంజూ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఇషాన్ ప్రత్యర్ధి బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఓవరాల్‌గా 43 బంతులు ఎదుర్కొన్న ఇషాన్.. 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 63) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు.
అదేవిధంగా హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) దూకుడుగా ఆడారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు, శాంట్నర్, జేమిసన్, డఫీ తలా వికెట్ సాధించారు.


