
మా ‘టెస్టు’కు ఏళ్ల క్రితమే ఈ దుస్థితి
వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ స్యామీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌నే శాసించిన వెస్టిండీస్ ఇప్పుడు మాత్రం క్రికెట్ కూనలకంటే కూడా దిగజారింది. ఇప్పటికీ విశ్వవ్యాప్త లీగ్‌లలో మెరిపిస్తుంది కరీబియన్ క్రికెటర్లే! కానీ సంప్రదాయ క్రికెట్‌నే మాకు పట్టనే పట్టదన్నట్లు పూర్తిగా గాలికొదిలేశారు విండీస్ క్రికెటర్లు. అయితే తమ జట్టు పతనం ఈనాటిది కాదని అదెప్పుడో మొదలైందని వెస్టిండీస్ కోచ్ డారెన్ స్యామీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. భారత పర్యటనకు వచ్చిన విండీస్ తొలి టెస్టును మూడు రోజుల్లోనే ఓడింది. కరీబియన్ క్రికెట్ దీనావస్థపై, జట్టు ప్రదర్శన హీనావస్థపై స్యామీ మాట్లాడుతూ ‘మేం భారత్‌లో చివరిసారి 1983లో టెస్టు సిరీస్ గెలిచాం. అప్పటికీ నేను పుట్టనేలేదు. గత 42 ఏళ్లుగా మళ్లీ ఏనాడూ గెలవనేలేదు.
జట్టు ఫలితాల నేపథ్యంలో నేనిప్పుడు విమర్శకుల కంట్లో పడ్డానని నాకు బాగా తెలుసు. అయితే దీన్నుంచి తప్పించుకోవాలని గానీ, వైఫల్యాలపై కప్పిపుచ్చాలని గానీ నాకు లేదు. ఈ వైఫల్యం నేనొచ్చాకే మొదలవ్వలేదు. రెండేళ్ల క్రితం నుంచే లేదు. చాలా ఏళ్ల క్రితమే వెస్టిండీస్ టెస్టు క్రికెట్ పతనం మొదలైంది. చెప్పాలంటే క్యాన్సర్ వ్యాధిలా మొదలై... క్రమంగా మా విండీస్ క్రికెట్ మొత్తానికి వ్యాపించింది. కేవలం బోర్డులోనో లేదంటే జట్టులోనో కాదు... సర్వత్రా మహమ్మారి విస్తరించింది. మొత్తం క్రికెట్ సిస్టమ్‌లోనే పాతుకుపోయింది. చివరకు పతనానికి చేరింది’ అని అన్నాడు. వెస్టిండీస్ గెలిచిన రెండు టి20 ప్రపంచకప్‌లకు స్యామినే విజయసారథి. ఇతని నేతృత్వంలోనే 2013లో భారత పర్యటనకు వచి్చన వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో ఓడింది. ‘మా ఆటగాళ్లంతా తమ చేతుల్లో ఉన్నది... తమ చేతనైనదే చేస్తున్నారు. అంటే ఏది బాగా ఆడగలమో అదే ఆడుతున్నారు. దీనికి విశ్వవ్యాప్త ఫ్రాంచైజీ క్రికెట్ కూడా కారణం’ అని టి20 క్రికెట్‌పై తమ ఆటగాళ్లకున్న మోజును స్యామీ నిజాయితీగా అంగీకరించాడు. అయితే దీనికి కారణం లేకపోలేదని చెప్పాడు.
ఇతర దేశాలు, జట్లతో పోల్చుకుంటే వసతులు, ఆధునిక సౌకర్యాలు, సాంకేతికత, నిష్ణాతులైన కోచింగ్ సిబ్బంది మన కంటే మిగతా జట్ల వద్దే ఎక్కువగా ఉంటే ఆ జట్లే మాకంటే మేటిగా ఉంటాయన్నాడు. ఇది బహిరంగ సత్యమన్నాడు. విండీస్ కొన్నేళ్లుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతోందన్నాడు. ఒకప్పుడు వెస్టిండీస్ ప్రపంచ క్రికెట్‌లో మేటి జట్టుగా ఉన్నప్పుడు ఇప్పటి భారత్‌లా ఏనాడు ఆలోచించలేకపోయిందని, ఎదగలేకపోయిందని స్యామీ విశ్లేషించాడు. ముఖ్యంగా ఆరి్థక కష్టాలు దూరమైతేనే ఎదైనా మొదలవుతుందన్నాడు. చెప్పుకోదగ్గ స్పాన్సర్లు దొరికితేనే జట్టు పరిస్థితి మారుతుందని లారా, చందర్‌పాల్ తదితర దిగ్గజాలు ఇదివరకే పేర్కొన్నారు.