
గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న ఆస్ట్రేలియా (Australia) మిడిలార్డర్ ఆటగాడు మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne) ఎట్టకేలకు ఫామ్ దొరకబుచ్చుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశాడు. తొలుత షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో (రెడ్ బాల్) సెంచరీ చేసిన లబూషేన్.. తాజాగా ఆస్ట్రేలియా దేశవాలీ వన్డే కప్‌లో శతక్కొట్టాడు.
వన్డే కప్‌లో లబూషేన్ కొద్ది రోజుల కిందట కూడా ఓ సెంచరీ చేశాడు. మొత్తంగా 20 రోజుల వ్యవధిలో లబూషేన్ మూడు సెంచరీలు చేసి, యాషెస్ సిరీస్‌కు ముందు ఆసీస్ సెలెక్టర్లకు సవాల్ విసిరాడు.
లబూషేన్‌ను తాజాగా ఆసీస్ వన్డే జట్టు నుంచి తప్పించారు. త్వరలో భారత్‌తో జరుగబోయే సిరీస్‌ను ఎంపిక చేయలేదు. లబూషేన్ ఇటీవలికాలంలో వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో దారుణంగా విఫలమవుతున్నాడు.
మూడు నెలల కిందటే అతన్ని టెస్ట్ జట్టు నుంచి తప్పించారు. లబూషేన్ చివరిగా సౌతాఫ్రికాతో జరిగిన డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్ ప్రమోషన్ పొందినా, పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
గత డబ్ల్యూటీసీ సీజన్ మొత్తం లబూషేన్ ప్రదర్శన ఇలాగే ఉండింది. ఆ సైకిల్‌లో 20 మ్యాచ్‌ల్లో ఒకే ఒక సెంచరీ చేశాడు. అందులో కేవలం 27తో పరుగులు చేశాడు. ఇది అతని కెరీర్ తొలినాళ్లలో ప్రదర్శనలతో పోలిస్తే చాలా తక్కువ. లబూషేన్ కెరీర్ ఆరంభంలో 70కి పైగా సగటుతో పరుగులు చేశాడు.
ఇప్పటివరకు 58 టెస్ట్‌లు ఆడిన లబూషేన్.. 46.2 సగటున 12 సెంచరీల సాయంతో 4435 పరుగులు చేశాడు.
తాజా సెంచరీ విషయానికొస్తే.. వన్డే కప్‌లో క్వీన్స్‌లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న లబూషేన్.. ఇవాళ (అక్టోబర్ 9) టస్మానియాతో జరుగుతున్న మ్యాచ్‌లో 91 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో లబూషేన్‌తో పాటు జాక్ క్లేటన్ (64) కూడా రాణించాడు. 44.4 ఓవర్ల తర్వాత క్వీన్స్‌లాండ్ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 307 పరుగులుగా ఉంది. జేవియర్ బార్ట్‌లెట్ (11), జేమ్స్ బాజ్లీ (1) క్రీజ్‌లో ఉన్నారు.