
టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) చేతిలో ఎదురైన పరాభవానికి ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టి ప్రత్యర్దికి షాకిచ్చింది. యూఏఈ వేదికగా జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లలో తొలుత బంగ్లాదేశ్ 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్ చేసింది.
అబుదాబీ వేదికగా నిన్న (అక్టోబర్ 8) జరిగిన తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (Azmatullah Omarzai) ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టాడు. రషీద్ ఖాన్ (Rashid Khan) తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. రహ్మానుల్లా గుర్బాజ్, రహ్మత్ షా అర్ద సెంచరీలతో రాణించారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఒమర్‌జాయ్ (9-0-40-3), రషీద్ ఖాన్ (10-0-38-3), అల్లా ఘజన్‌ఫర్ (9.5-1-55-2) ధాటికి 48.5 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తౌహిద్ హృదోయ్ (56), కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ (60) అర్ద సెంచరీలతో రాణించారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 47.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి ఆట ముగించింది. రహ్మానుల్లా గుర్బాజ్ (50), రహ్మత్ షా (50) అర్ద సెంచరీలతో రాణించగా.. ఒమర్‌జాయ్ (40), కెప్టెన్ హష్మతుల్లా షాహీది (33 నాటౌట్) పర్వాలేదనిపించారు.
బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. తన్వీర్ ఇస్లాం, మెహిది హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే అక్టోబర్ 11న ఇదే వేదికగా జరుగుతుంది.
చదవండి: World Cup 2025: పాక్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా