
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC World Cup)లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా రెండో విజయం సాధించింది. టోర్నీలో తొలుత న్యూజిలాండ్ వుమెన్‌ను 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన ఆసీస్ జట్టు.. తాజాగా పాకిస్తాన్ (Aus W vs Pak W)పై ఘన విజయం సాధించింది.
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆసీస్.. పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు కెప్టెన్ అలిసా హేలీ (20), ఫోబే లిచ్‌ఫీల్డ్ (10).. వన్‌డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ (5) విఫలం కావడంతో ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
మూనీ సెంచరీ.. అలనా హాఫ్ సెంచరీ
ఆ తర్వాత కూడా పాక్ బౌలర్లు విజృంభించడంతో ఐదో నంబర్ ప్లేయర్ అనాబెల్ సదర్లాండ్ (1) సహా ఆ తర్వాత వచ్చిన ఆష్లే గార్డ్‌నర్ (1), తహీలా మెగ్రాత్ (5), జార్జియా వారేహామ్ (0), కిమ్ గార్త్ (11) పెవిలియన్‌కు క్యూ కట్టారు.
ఈ నేపథ్యంలో కేవలం 76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆసీస్‌ను బెత్ మూనీ (Beth Mooney), అలనా కింగ్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు. మూనీ 114 బంతుల్లో 109 పరుగులతో చెలరేగగా.. అలనా 49 బంతుల్లో 51 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.
చెలరేగిన ఆసీస్ బౌలర్లు
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. కిమ్ గార్త్ బౌలింగ్‌లో ఓపెనర్ సదాఫ్ షమాస్ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించగా.. మునీబా అలీ (3)ని మేగన్ షట్ వెనక్కి పంపింది. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన సిద్రా ఆమిన్ (35) కాసేపు పోరాడగా.. ఆష్లే గార్డ్‌నర్ ఆమెను అవుట్ చేసింది.
ఇక నాలుగో నంబర్ బ్యాటర్ సిద్రా నవాజ్ (5) వికెట్‌ను కిమ్ గార్త్ తన ఖాతాలో వేసుకోగా.. నటాలియా పర్వేజ్ (1)ను మేగన్ పెవిలియన్‌కు పంపింది. ఇక కెప్టెన్ ఫాతిమా సనా 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సదర్లాండ్ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా.. డయానా బేగ్ (7)ను జార్జియా వారేహామ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది.
114 పరుగులకే కుప్పకూలిన పాక్
ఈ క్రమంలో 86 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన పాక్‌ను లక్ష్యం దిశగా నడిపించేందుకు స్పిన్నర్లు రమీన్ షమీమ్ (15), నష్రా సంధు (11) విఫలయత్నం చేశారు. అయితే, అలనా బౌలింగ్‌లో నష్రా తొమ్మిదో వికెట్‌గా.. సదర్లాండ్ బౌలింగ్‌లో షమీమ్ పదో వికెట్‌గా వెనుదిరగడంతో పాక్ పోరాటం ముగిసిపోయింది.
ఈ క్రమంలో 36.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయిన పాక్.. ఆసీస్ చేతిలో 107 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇదిలా ఉంటే.. ఆసీస్ తమ రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో ఆడాల్సి ఉండగా.. వర్షం కారణంగా టాస్ పడకుండానే ఆ మ్యాచ్ రద్దైపోయింది.
చదవండి: అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు