
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ (Beth Mooney) అద్భుత శతకంతో చెలరేగింది. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మొక్కవోని దీక్షతో వంద పరుగుల మార్కును దాటి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించింది. ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించి పాక్ సంబరాలపై నీళ్లు చల్లింది.
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI World Cup)లో భాగంగా కొలంబో వేదికగా ఆసీస్- పాకిస్తాన్ (Aus W vs Pak W) జట్ల మధ్య మ్యాచ్‌కు బుధవారం షెడ్యూల్ ఖరారైంది. ఆర్.ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
పాక్ బౌలర్ల విజృంభణ
కెప్టెన్ ఫాతిమా సనాతో పాటు సైదా ఇక్బాల్ ఆది నుంచే చెలరేగి ఆసీస్ ఓపెనింగ్ జంటను విడదీశారు. ఈ క్రమంలో ఓపెనర్లలో ఫొబు లిచ్‌ఫీల్డ్ 10, కెప్టెన్ అలిసా హేలీ 20 పరుగులకే పరిమితం కాగా.. వన్‌డౌన్లో వచ్చిన ఎలిస్ పెర్రీ (5) దారుణంగా విఫలమైంది. నష్రా సంధు బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగింది.
పాక్ బౌలర్ల ధాటికి ఐదో స్థానంలో వచ్చిన అనాబెల్ సదర్లాండ్ (1), ఆష్లే గార్డ్‌నర్ (1), తాహిలా మెగ్రాత్ (5) ఇలా వచ్చి అలా వెళ్లగా.. జార్జియా వారేహమ్ (0), కిమ్ గార్త్ (11) కూడా చేతులెత్తేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాలుగో నంబర్ బ్యాటర్ బెత్ మూనీ.. ఆల్‌రౌండర్ అలనా కింగ్‌తో కలిసి అద్భుత పోరాటం చేసింది.
బెత్ మూనీ సంచలన ఇన్నింగ్స్
ఆసీస్ 76 పరుగులకే ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. బెత్ మూనీ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసింది. సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ 114 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 109 పరుగులు సాధించింది. అయితే, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఫాతిమా సనా బౌలింగ్‌లో సదాఫ్ షమాస్‌కు క్యాచ్ ఇవ్వడంతో మూనీ అవుటైపోయింది.
ఏకంగా 106 పరుగులు జోడించి.. పాక్ సంబరాలపై నీళ్లు
మరో ఎండ్‌లో అలనా కింగ్ 49 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 51 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరు కలిసి తొమ్మిదో వికెట్‌కు ఏకంగా 106 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించారు. మూనీ, అలనా అద్భుత ప్రదర్శన కారణంగా ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.
దీంతో ఆదిలోనే వరుస వికెట్లు తీసిన పాక్ జట్టుకు ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఇక పాక్ బౌలర్లలో నష్రా సంధు అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. రమీన్ షమీమ్, ఫాతిమా సనా చెరో రెండు.. డయానా బేగ్, సదియా ఇక్బాల్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. పాక్‌పై బ్యాట్‌తో విజృంభించిన బెత్ మూనీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇదొక అత్యుత్తమ ఇన్నింగ్స్ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెను కొనియాడుతున్నారు.
చదవండి: అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Alert 🚨
- You are watching one of the greatest comeback of all time as Australia 🇦🇺 were 76/7, but at the end scored 221/9 👏🏻
- Beth Mooney and Alana King had a unbeaten partnership of 106 🔥 with Mooney's epic 💯 & King's 50 🥶
- What's your take 🤔pic.twitter.com/nRkac6VuZy— Richard Kettleborough (@RichKettle07) October 8, 2025