
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar)పై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ (Steve Harmison) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ (Rohit Sharma)- విరాట్ కోహ్లి (Virat Kohli) విషయంలో అగార్కర్‌కు ఓటమి తప్పదని వ్యాఖ్యానించాడు. ఈ ఇద్దరు దిగ్గజ కెప్టెన్లు.. ముఖ్యంగా కోహ్లి.. అగ్కార్‌ను తప్పక ఓడించితీరతాడని పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరు టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు. రో- కో ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతుండగా.. బీసీసీఐ ఇటీవల అనూహ్య నిర్ణయం తీసుకుంది.
శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు
ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రోహిత్ శర్మ వన్డే కెప్టెన్‌గా తప్పించి.. శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించింది. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా గిల్ వన్డే సారథిగా తన ప్రయాణం మొదలుపెడతాడని వెల్లడించింది. ఇక ఈ జట్టులో రోహిత్, కోహ్లి ఆటగాళ్లుగా కొనసాగనున్నారు.
రో- కోకు పరోక్షంగా వార్నింగ్
ఇక రోహిత్‌పై వేటు వేయడం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. రో- కో వన్డే వరల్డ్‌కప్-2027 వరకు ఆడతారని గ్యారెంటీ లేదని పేర్కొన్నాడు. అందుకే గిల్‌ను కెప్టెన్ చేసినట్లు వెల్లడించాడు. అంతేకాదు.. వరల్డ్‌కప్ నాటికి జట్టులో ఉండాలంటే దేశీ క్రికెట్ కూడా ఆడకతప్పదని రో- కోకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు.
అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు
ఈ విషయం గురించి స్టీవ్ హార్మిసన్ తాజాగా స్పందించాడు. ‘‘దురదృష్టవశాత్తూ.. చివరికి అగార్కర్ అవమానకరమైన ముగింపు తప్పదని భావిస్తున్నా. ఈ పోటీలో మాజీ కెప్టెన్లు గెలుస్తారా? లేదంటే మాజీ ఆల్‌రౌండర్‌దే గెలుపా? అంటే.. కచ్చితంగా ఆ ఇద్దరే గెలుస్తారని అనుకుంటున్నా.
అలా కాకుండా కేవలం కోహ్లి- శర్మలను రెచ్చగొట్టడానికి.. వారిని ఎలాగైనా వరల్డ్‌కప్‌లో ఆడించాలనే ఉద్దేశంతో అగార్కర్ ఈ మాటలు అంటే అది వేరే సంగతి. నిజంగా అదొక మంచి విషయమే అవుతుంది. అలా కాకుండా వారి గురించి ఉద్దేశపూర్వకంగానే ఇలా మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము.
కోహ్లి మాత్రం కచ్చితంగా..
రోహిత్ కంటే కోహ్లికి వన్డేల్లో గొప్ప రికార్డు ఉంది. రోహిత్ కోహ్లి కంటే వయసులోనూ కాస్త పెద్దవాడు. కాబట్టి వరల్డ్‌కప్ నాటికి రోహిత్ విషయం ఎలా ఉన్నా.. కోహ్లి మాత్రం కచ్చితంగా కొనసాగుతాడనే అనుకుంటున్నా.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లపై 350 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లి లేకుంటే టీమిండియా ఎలా గెలవగలదు?.. బహుశా కోహ్లి మనసులో కూడా ఇదే ఉండి ఉంటుంది. ఏదేమైనా అగార్కర్‌కు ఈ విషయంలో ఓటమి తప్పదు.
ఛేజింగ్ కింగ్
ఒకవేళ అగార్కర్ నిజంగానే రో- కో గురించి అలా అన్నాడా? లేదంటే అనువాద తప్పిదాలు ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియవు’’ అని స్టీవ్ హార్మిసన్ పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో ఛేజింగ్‌లోనే కోహ్లి 28 శతకాలు బాది 8064 పరుగులు రాబట్టాడు.
ఇందులో 41 హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. అత్యుత్తమ స్కోరు 183. అంతేకాదు.. 300 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లి ఏకంగా ఏడు సెంచరీలు నమోదు చేయడం అతడు ఛేజింగ్ కింగ్ అనడానికి మరో నిదర్శనం.
చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్