
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఇటీవల The Game Plan అనే యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ 2025లో భారత్ తమతో ఆడకపోతేనే మంచిదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భారత్ తమతో మ్యాచ్‌లను ఎలాగైతే బాయ్‌కాట్ చేసిందో ఆసియా కప్‌లోనూ అలాగే చేస్తే బాగుంటుందని అన్నాడు.
ఒకవేళ భారత్ ఆసియా కప్‌లో తమతో మ్యాచ్‌లు ఆడేందుకు ముందుకు వస్తే మాత్రం వారు కొట్టే చావుదెబ్బను ఊహించలేమని తెలిపాడు. ఇలా జరగకూడదని దేవుడిని ప్రార్దిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
బాసిత్ అలీ చేసిన ఈ వ్యాఖ్యలు పాక్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. బాసిత్ వ్యాఖ్యలపై పాక్ మీడియా కూడా దుమ్మెత్తిపోస్తుంది. మరోవైపు భారత అభిమానులు మాత్రం బాసిత్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. కరెక్ట్‌గా చెప్పాడంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా పాక్ విండీస్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత బాసిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. విండీస్‌తో జరిగిన చివరి వన్డేలో పాక్ 92 పరుగులకే ఆలౌటై, 202 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమితో పాక్ విండీస్‌కు 35 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను కోల్పోయింది.
ఈ ఓటమి తర్వాత బాసిత్ అలీ పాక్ జట్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి జట్టుతో భారత్ లాంటి పటిష్ట జట్టును ఎప్పుడు ఓడించాలంటూ కామెంట్లు చేశాడు.
కాగా, యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య మరిన్ని మ్యాచ్‌లు జరిగే ఆస్కారం కూడా ఉంది. దీనికి ముందు పాక్‌తో ఆడేందుకు భారత ప్రభుత్వం సమ్మతించాలి.
పాక్‌తో ఆడే విషయమై భారత క్రీడాభిమానులు, క్రికెట్ విశ్లేషకులు, మాజీలు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు క్రికెట్ వేరు, దేశ సమస్య వేరని అంటుంటే.. మరికొందరు మాత్రం నీచ బుద్ది ఉన్న పాక్‌తో క్రికెటే కాకుండా ఏ ఆట ఆడకూడదని భీష్మించుకూర్చున్నారు.