
సాక్షి, విజయవాడ: ఏరికోరి సీఎం చంద్రబాబు నియమించుకున్న ఐఏఎస్ అధికారితో టీడీపీ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాటల యుద్ధానికి దిగారు. ఒకరికొకరు తిట్టుకోవడంతో పాటు పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో నడుస్తున్న ఈ పంచాయితీ హాట్ టాపిక్‌గా మారింది.
టీడీపీ ఎంపీ శబరి వెర్సస్ సీఎంవో కార్యదర్శి కార్తికేయ మిశ్రా ఢిల్లీలో దారుణంగా తిట్టుకున్నారు. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం రోజే జరిగిన ఈ వాగ్వాదం వివరాలు ఇలా ఉన్నాయి.. ‘‘ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం కోసం వచ్చిన సీఎం చంద్రబాబును కలిసేందుకు ఎంపీ శబరి ఎదురు చూడసాగారు. ఆ సమయంలో ఆమెను సీఎం అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రా‘‘సీఎం బాగా బిజీగా ఉన్నారు’’ అని చెప్పి అనుమతించలేదు. అప్పటిదాకా పడిగాపులు పడ్డ ఆమె ఆ సమాధానంతో ఒక్కసారిగా ఊగిపోయారు.
‘‘నేనొక ఎంపీని.. నాతో ఇలాగేనా మాట్లాడేది’’ అని గట్టిగా అరిచారు. దీనికి ఆయన ‘‘నీలా ఎవరూ నాతో ఇప్పటిదాకా ఇలా మాట్లాడలేదు’’ అంటూ మండిపడ్డారు. ఆ ఏకవచనం పిలుపుతో మరింత రగిలిపోయిన శబరి.. తనతో మర్యాదగా ప్రవర్తించాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ వివాదం మరింత ముదరకుండా.. కొందరు ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. కట్ చేస్తే..
తాజాగా ఆమె మంత్రి నారా లోకేష్‌కు ఈ వ్యవహారంపై పిర్యాదు చేశారు. లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా కార్తీకేయ మిశ్రాకు పేరుంది. ఈ క్రమంలోనే ఆయన్ని కావాలనే చంద్రబాబుకి అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. అయితే తాజా వివాదం నేపథ్యంలో.. సీఎంవో సీనియర్ అధికారి ఒకరి చేత విచారణకు ఆదేశించినట్లు సమాచారం.