
బెయిల్ పిటిషన్‌పై విచారణ దాని సొంత మెరిట్స్ ఆధారంగా జరగాలి
సాక్షి, న్యూఢిల్లీ: వ్యక్తి స్వేచ్ఛకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు హైకోర్టు, ట్రయల్ కోర్టులకు మరోసారి స్పష్టం చేసింది. బెయిల్ పిటిషన్‌ల విచారణ ప్రతి కేసు విషయంలో దాని సొంత మెరిట్స్ ఆధారంగా జరగాలని, ఒకరి కేసుతో మరొకరి కేసును ముడిపెట్టడం సరికాదని న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై అసహనం వ్యక్తం చేసింది.
ట్రయల్ కోర్టులు బెయిల్ అంశంలో వ్యక్తిగత హక్కులు, స్వేచ్ఛను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలతో మద్యం అక్రమ కేసులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భారీ ఊరట లభించింది.
కేసు నేపథ్యం ఏమిటంటే..
మద్యం అక్రమ కేసులో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఇదే కేసులో నాల్గవ నిందితునికి ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న హైకోర్టు, బెయిల్ రద్దు పిటిషన్‌పై తాము తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ కేసుకు సంబంధించిన ఇతర బెయిల్ పిటిషన్లపై విచారణను నిలిపివేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలతో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ నిరవధికంగా నిలిచిపోయింది. తనకు సంబంధం లేని కేసు కారణంగా తన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగకపోవడం తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొంటూ భాస్కర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే:
సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు భాస్కర్ రెడ్డి పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ జె.బి.పార్దీవాలా ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. పిటిషనర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘గత నాలుగు నెలలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలులో ఉన్నారు.
ఆయన బెయిల్ పిటిషన్‌కు, హైకోర్టులో నడుస్తున్న మరో నిందితుడి బెయిల్ రద్దు పిటిషన్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయినా విచారణ నిలిపివేయడం అన్యాయం. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం హామీ ఇచ్చిన వ్యక్తి స్వేచ్ఛ హక్కును హరించడమే’ అని వాదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదన.లు వినిపించారు.
చెవిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను తక్షణం విచారించాలి: సుప్రీం ఆదేశాలు
సుదీర్ఘ వాదనల అనంతరం ధర్మాసనం ఈ పిటిషన్‌పై స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ‘ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఆమోదించలేదు. ఈ కేసులో ఇతర నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన, చెవిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను ఆపడం సరికాదు.
ఒకరి వ్యక్తి స్వేచ్ఛ అంశం ఇమిడి ఉన్నప్పుడు, ఆ బెయిల్ పిటిషన్‌పై విచారణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించడం వెనుక ఎలాంటి బలమైన కారణాలు కనిపించడం లేదు. వేర్వేరు దరఖాస్తులను ఒకే గాటన కట్టడం సరికాదు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు తక్షణమే విచారించాలి.
ఇతర కేసులతో సంబంధం లేకుండా, కేసు మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. మరో నిందితుడి బెయిల్ రద్దుపై హైకోర్టులో విచారణ దాని సొంత మెరిట్‌పై కొనసాగవచ్చు. ఆ విచారణలోని అంశాలు గానీ, పరిశీలనలు గానీ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి ప్రభావం చూపకూడదు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలను ఆయా కోర్టుల ముందు ఉంచవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో పిటిషన్‌ను పరిష్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.