
ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయికి వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. తిరుమల పరకామణి వివాదంపై సీబీఐతో దర్యాప్తు జరపాలని అమిత్ షాను గురుమూర్తి కోరారు. పరకామణి వివాదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయికి విజ్ఞప్తి చేశారు.
‘‘పరకామణి వివాదానికి ఏపీ సర్కార్ రాజకీయ రంగు పులుముతోంది. వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలతో ఆటలాడుతోంది. 100 కోట్ల హిందువుల విశ్వాసాలతో చెలగాటమాడటం దారుణం. వివాదంపై పారదర్శక, నిష్పక్షపాత దర్యాప్తు అవసరం. మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధం. ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. జ్యూడిషియల్ విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలి’’ అని సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో గురుమూర్తి పేర్కొన్నారు.
‘‘రాజకీయ ప్రతీకారం కోసం తిరుమల పరకామణి వివాదాన్ని టీడీపీ ప్రభుత్వం వాడుకుంటుంది. ఏపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోంది. దేవాలయ ప్రతిష్టను మంటగలిపేందుకు విమర్శలు చేస్తున్నారు. భక్తుల విశ్వాసాలతో ఆటలాడుతున్నారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలి. నిష్పక్షపాత పారదర్శక విచారణతోనే సత్యం బయటపడుతుంది. రాజకీయ దురుద్దేశాలకు చెక్ పడుతుంది. ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు జరిపి భక్తుల విశ్వాసాలను కాపాడాలి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో గురుమూర్తి విజ్ఞప్తి చేశారు.